అది నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కేటీఆర్‌ సవాల్‌ | Sakshi
Sakshi News home page

కేఏ పాల్‌ కాదు.. కోమటిరెడ్డి మాత్రమే జోకర్‌: ‍కేటీఆర్‌

Published Sat, May 25 2024 12:38 PM

KTR Open Political Challenge To Congress And BJP

సాక్షి, తెలంగాణభవన్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అలాగే, ఉమ్మడి ఏపీలో కా​ంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందన్నారు. రేవంత్‌ రెడ్డి దివాలాకోరు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

కాగా, కేటీఆర్‌ శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇచ్చింది?. ఎప్పుడు పరీక్షలు పెట్టారు. రిజల్ట్స్‌ ఎప్పుడు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చాక 32వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి పెడితే ఆయన నియామక పత్రాలు ఇచ్చారు. ఇది రేవంత్‌ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు నియామక పత్రాలు ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. నాలుగైదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్‌తో రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణకు తప్ప, వేరే రాష్ట్రానికి ఉందా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే. మేము గత పదేళ్ళలో  రెండు లక్షల 32 వేల 308 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ది విషయంలో దేశంలో తెలంగాణ కంటే ముందు మరే రాష్ట్రం ఉందో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి?. ఇది నిరూపిస్తే నేను రేపు(ఆదివారం) ఈ సమయానికి రాజీనామాచ చేస్తా. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు నా సవాల్‌కు సిద్ధమేనా?. 

ఒక మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంట్‌ పోతుంది అని ఎలా అంటాడు. ఆయన మంత్రా? జోకరా?. కేఏ పాల్ జోకర్ కాదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే జోకర్. ఆసుపత్రిలో కరెంట్ పోతే జనరేటర్ లేదా?. ఇదేం ప్రభుత్వం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు

Advertisement
 
Advertisement
 
Advertisement