ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఇచ్చిన ప్రచార ప్రకటనను గమనించారా? అందులో కొన్ని పరిశ్రమల ఫోటోలు ప్రచురించారు. వాటిలో మొదటిది గ్రీన్ కో కంపెనీది కావడం విశేషం. ఈ సంస్థకు శ్రీకారం చుట్టింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు నిత్యం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అప్పట్లో పరిశ్రమలను తరిమేశారని అసత్యాలు చెబుతుంటారు. కాని వారి ప్రస్తుత ప్రచార ప్రకటనలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వేల కోట్ల పెట్టుబడి కలిగిన గ్రీన్ కో సంస్థకే అగ్ర తాంబూళం ఇవ్వక తప్పలేదు.
నిజానికి అప్పట్లో ఈ గ్రీన్ కో కంపెనీకి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు వంటి మీడియా పలు వ్యతిరేక కథనాలు ప్రచారం చేసింది. అయినా జగన్ వాటిని పట్టించుకోకుండా ముందుకు తీసుకువెళ్లారు. 2022 మే 17 వ తేదీన జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఈ రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ఒక దశకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తదనుగుణంగా జగన్ ప్రభుత్వం వారికి సహకరించింది. 4766 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం కేటాయించగా, 2800 ఎకరాలలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సుమారు 15 వేల కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమగా చెబుతున్నారు.
హైడల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై కూడా అప్పట్లో ఎల్లో మీడియాకు చెందిన కొందరు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి అది ప్రధాన ప్రాజెక్టుగా మారింది. తద్వారా జగన్ పరిశ్రమలకు ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం చేసుకోవచ్చు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డ్రగ్ పార్క్‌ను కేంద్రం నుంచి తీసుకువస్తే... మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అప్పట్లో దానిని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ మధ్యకాలంలో జమ్మలమడుగు, శ్రీకాకుళం వంటి కొన్నిచోట్ల పారిశ్రామికవేత్తలకు కూటమి ఎమ్మెల్యేల నుంచి, నేతల నుంచి బెదిరింపు వార్తలు వచ్చాయి. ముడుపుల కోసం వారిని ఇబ్బంది పెట్టిన ఆరోపణలు వచ్చాయి. జగన్ టైమ్‌లో అలాంటివి పెద్దగా లేకపోయినా, ఏదో తప్పు జరిగిపోతుందన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేసేవారు. ఇదే అడ్వర్టైజ్ మెంట్‌లో ఇచ్చిన రెండో ఫోటో గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థది.
ఈ కంపెనీ ప్రస్తుతం కొత్త యూనిట్‌లను ఏర్పాటు చేయడం కాకుండా, ఉన్న ప్లాంట్ల విస్తరణను 70 కోట్లతో చేపడుతోంది. ఈ సంస్థ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద ఎడిబిల్ ఆయిల్ రిఫైనరీని వంద కోట్లతో ఏర్పాటు చేసింది. అది ప్రారంభమైంది కూడా గత ప్రభుత్వ హయాంలోనే అని చెప్పాలి.
జగన్ ప్రభుత్వం టైమ్‌లో 2023 జూన్ 22న ఈ సంస్థ అక్కడ కార్యకలాపాలను ఆరంభించింది. ఆ కంపెనీ హనుమాన్ జంక్షన్ సమీపంలోని కానుమోలు వద్ద ఎప్పటి నుంచో పశువుల మేత తయారీ ప్లాంట్‌ను నడుపుతోంది. ఆస్ట్రో బేస్ అనే కంపెనీ తొట్టంబేడు వద్ద స్పేస్ ఇందనానికి సంబంధించిన యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బెంగుళూరులో ఈ సంస్థ పనిచేస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఈ యూనిట్ 22 ఎకరాలలో ఏర్పాటవుతోంది. ఉద్యోగావకాశాలు ప్రస్తుతానికైతే వందలోపే అన్నట్లుగా గూగుల్‌లో సమాచారం వస్తోంది. ఆదిత్య బిర్లా హిండాల్కో ప్రాజెక్టును తమ ప్రచారంలో వాడుకున్నారు. 2021 -2022 లో అప్పటికే కుప్పం వద్ద ఉన్న అల్యూమినియం ప్లాంట్‌ను ఈ సంస్థ తీసుకుంది. ప్రస్తుతం 586 కోట్లతో విస్తరించాలని ప్రతిపాదించారు.
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా పులివెందుల, రాజమండ్రి సమీపంలోను కొన్ని పరిశ్రమలు స్థాపించిన సంగతి తెలిసిందే. ఎల్‌జీ సంస్థ శ్రీ సిటీలో తన ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. శ్రీసిటీ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పడిన సంగతి విదితమే. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన కాలుష్యంతో 13 మంది మరణించిన తర్వాత అప్పట్లో ఆ సంస్థపై టీడీపీతో సహా ఆయా పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ కంపెనీకి చెందినవారు అరెస్టు కూడా అయ్యారు. విశాఖ యూనిట్‌ను మూసివేశారు. తదుపరి జగన్ టైమ్‌లో ఆ కంపెనీని శ్రీ సిటీలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు కూటమి ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఆరువేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు అన్నవి ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వాలకు సంబంధించి లోటుపాట్లు ఉంటే చెప్పవచ్చు. సరిచేయవచ్చు. అలాకాకుండా విధ్వంసం అని, తరిమేశారు అని పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం దుర్మార్గం. దానివల్ల పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుంది. దానికి తోడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది.
సహజంగానే పారిశ్రామికవేత్తలపై ఈ ప్రభావం పడుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా విశాఖ సదస్సు గురించి శరభ, శరభ అని, పెట్టుబడుల పండగ అని, జాతర అని చిందులు తొక్కుతోంది. గత సదస్సుల ద్వారాకాని, ఇతరత్రాకాని 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఊదరగొడుతుంటారు. కేవలం నిరుద్యోగ భృతి హామీని కప్పిపుచ్చడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని నిరుద్యోగులు అర్థం చేసుకుంటున్నారు. నిజంగా లక్షల ఉద్యోగాలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు, అందులో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు తెలియచేయాలని మాజీ మంత్రి పేర్పి నాని సవాల్ చేశారు.
తాజాగా మరో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడడంతో ప్రయోజనం ఉండదు. వాస్తవాలకు అనుగుణంగా పెట్టుబడుల గురించి చెబితే మంచిది.
కాగా విశాఖ సదస్సులో పాత పెట్టుబడులతోనే ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఎంఓయులు చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. కారణం ఏమో కాని హోం మంత్రి అమిత్ షా వస్తారనుకుంటే ఆయన రావడం లేదు. ఏది ఏమైనా రియాల్టి షోగా ఈ భాగస్వామ్య సదస్సు మారకుండా రియలిస్టిక్ సదస్సుగా ఉండాలని ఆకాంక్షించడం తప్పు కాదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


