ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారా? | KSR Comment On Yellow Media Newly Designed Stories | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారా?

Apr 24 2026 3:36 PM | Updated on Apr 24 2026 3:58 PM

KSR Comment On Yellow Media Newly Designed Stories

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కథనమే ఇది. అందులోను ఎల్లో మీడియా ఈ రకమైన స్టోరీలు ఇచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  జీతాలు  తగ్గించారని,  ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, జాగ్రత్తపడకపోతే అధోగతే అంటూ టీడీపీ పక్షాన  పనిచేసే ఆంధ్రజ్యోతి బానర్ వార్తను  ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు,  ఉన్నతాధికారుల జీతాలలో ఆరు నెలలపాటు  ముప్ఫై శాతం    కోత పెట్టాలని , మూడు,నాలుగు  రోజుల క్రితం  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.

ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపించడానికి ఆ రాష్ట్రం ఈ చర్య చేపట్టింది. .తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం దీనిని  క్లూగా వాడుకుని తన మీడియాకు ఒక లీక్ ఇచ్చినట్లు  కనిపిస్తుంది.ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంతేనని, అప్పుల భారం అదికం అవుతోందని,అందువల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని రాయండని ఎల్లో మీడియాకు పురమాయించి ఉండాలి.

తదనుగుణంగా ఆ మీడియా రాజభక్తితో ఆ కధనాన్ని ఇచ్చి ఉండాలి.  విశేషం ఏమిటంటే  తమిళనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ఎన్నికల సభలలో మాట్లాడుతూ  కేంద్రం సహకారంతో ఏపీ  బుల్లెట్ వేగంతో అభివృద్ది చెందుతోందని చెప్పారని కూడా ఇదే  ఎల్లో మీడియా రాసింది.చంద్రబాబు చెప్పినదానిలో వాస్తవం ఉంటే  ప్రభుత్వం పక్షాన పేద ఏడుపులు ఏడుస్తూ ఎల్లో మీడియా ప్రజలను ఎందుకు భయపెట్టింది? చంద్రబాబు అబద్దం చెప్పినట్లా?లేక ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లా?ఇదే  ఎల్లో మీడియా 2024 ఎన్నికల సమయంలో కూటమి మానిఫెస్టోకి భజన చేస్తూ అద్భుతం, అమోఘం, చంద్రబాబు సంపద సృష్టించగలరు.తద్వారా సూపర్ సిక్స్ హామీలతో సహా ఎన్నికల మానిఫెస్టో అంతటిని చిటికిన వేలుతో అమలు చేసేయగలరు అని ఎందుకు ప్రచారం చేశారు.

అందులో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని, అంటే జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? ఉద్యోగుల ఇతర కోర్కెలను నెరవేరుస్తామని ఎలా చెప్పారు?ఇప్పుడేమో ఆర్ధిక క్రమశిక్షణ అవసరం అని సన్నాయి నొక్కులు ఎందుకు రాస్తున్నారు?ఇది ప్రజలను ,అందులోను ప్రభుత్వ ఉద్యోగులను  మోసం చేయడం కాదా ?అన్న ప్రశ్న వస్తుంది కదా!ఉద్యోగుల జీతాలవల్ల ఆర్దిక భారం అధికంగా ఉందని చెప్పడం తో పాటు సంక్షేమ స్కీముల అమలు వల్ల కూడా బాగా ఖర్చు అవుతోందని,  ఇందులో చాలా దుబారా ఉందని ఎల్లో మీడియా అంటోంది. ఇది చంద్రబాబు అభిప్రాయంగా తీసుకునే అవకాశం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే  ఆయన ఎప్పుడు ఏది చేసినా ముందుగా ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంటుందా?నెగిటివ్ గా ఉంటుందా?అన్నది చూసుకుంటారు.మొదటిసారి సీఎం అయినప్పుడే ఆయన  ఇలాంటి సర్వేలు చేసుకునేవారు.

1996 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేయకపోతే  నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే  సబ్సిడి బియ్యం ధర ఐదు రూపాయలు అవుతుందని ప్రచారం చేసేవారు. తమకు ఎక్కువ సీట్లు వస్తేనే మద్య నిషేధం కొనసాగించగలుగుతామని చెప్పేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో దాదాపు  సమానంగా టీడీపీ, సిపిఐ, సిపిఎమ్ కూటమికి  సీట్లు వచ్చాయి. తర్వాత ఆయన  రూటు  మార్చారు.  ప్రజాభిప్రాయ సేకరణ  అంటూ కొత్త కధ ఆరంభించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, సబ్సిడి బియ్యం రేట్లు పెంచకపోతే ప్రభుత్వం భరించలేదని చెప్పేవారు. అంతకు ముందు ఎన్.టి.రామారావు అమలు చేసిన  మద్య నిషేధాన్ని కొనసాగించలేమని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని, దానిని నియంత్రించలేకపోతున్నామని, ఆదాయం కూడా రావడం లేదని ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందేమో  ఎన్.టి.ఆర్ అనుమతించిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు.

తద్వారా మద్య  నిషేధం పై సీరియస్ గా ఉన్నట్లు చంద్రబాబు  పిక్చర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాతేమో మొత్తం ఎత్తివేశారు.ఆ టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో!ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనకు  అనుకూలంగా ఎక్కువమంది మాట్లాడేలా చూసుకునేవారు.తదుపరి జనం అంతా అలాగే కోరుకుంటున్నారని చెప్పి నిర్ణయాలను  మార్చివేసేవారు. ఇదేకాదు.1999లో బిజెపితో కలిసి కూటమి కట్టడంతో మళ్లీ గెలవగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలపై సమీక్షలు చేసి,వాటిలో లాభాలు  ఆర్జించని సంస్థలను మూసివేసే ప్రక్రియ ఆరంభించారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశారు.అప్పుడు  ప్రభుత్వరంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా మారాయని, వృధా వ్యయం అని పబ్లిసిటీ చేసేవారు.ఆ సంస్థలకు ఉన్న భూములను ప్రైవేటువారికి అప్పగించేశారు.ఆ భూములను ఆ సంస్థలు  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నాయని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారన్న భావన కల్పిస్తుంటారు.అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు  పాలనపై మండిపడుతుండేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే  చంద్రబాబు రిటైర్ మెంట్ వయసును  55 ఏళ్లకు తగ్గించబోతున్నారని ఉద్యోగులంతా నమ్మేవారు.నిజానికి ఆ ప్రతిపాదన లేదని అంటారు.కాని చంద్రబాబు ప్రభుత్వ సరళి చూశాక ఉద్యోగులంతా ఆ వదంతిని   నమ్మారు.2004లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణం అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిలో విద్యుత్ రంగం ఒకటి.దానిద్వారా తనకు క్రెడిట్ వస్తుందని అనుకున్న చంద్రబాబు  ఆ సంస్కరణలు అన్నీ తనవే  అని ప్రచారం చేసుకునేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అప్పటి ప్రతి పక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే  అలా చేస్తే  తీగెలపై  బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. తదుపరి వైఎస్ అధికారంలోకి రావడం, దానిని అమలు చేయడం జరిగింది.  ఆ తర్వాత ఆ ఘనత తనదేనని  కూడా చంద్రబాబు చెప్పుకునేవారు.

తదుపరి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన  కూడా ఉచిత విద్యుత్ ను కొనసాగించారు.అలా ఉంటుంది ఆయన  తీరు.గత టరమ్ లో ఉద్యోగుల జీతాభత్యాలపై ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో ఆయన  చేసిన సంభాషణ  వీడియో బయటకు వచ్చింది.ఇద్దరూ కూడా ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా ఆ వీడియో ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేసింది.అధికారంలో ఉంటే సంస్కరణలు  గురించి మాట్లాడే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫ్రీ అని, ఎక్కడలేని వాగ్దానాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే  మహిళలకు  ప్రతి నెల 1500 రూపాయలు, బలహీనవర్గాలకు ఏభై  ఏళ్లకే  పెన్షన్ తదితర సుమారు 150 హామీలు ఇచ్చారు.వాటన్నిటి ఖర్చు ఏడాదికి లక్షన్నర కోట్లు అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు తాము సంపద సృష్టిస్తామని, వాటిని అమలు చేసి చూపిస్తామని గప్పాలు  పలికేవారు.అధికారంలోకి వచ్చాక  మాత్రం తెల్లముఖం వేసి వారి హామీలను నమ్మిన ప్రజలను వెర్రివాళ్లుగా చేశారు.

ఇటీవల ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే  సరిపోతోందని, అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని చంద్రబాబు  చెప్పడం ఆరంభించారు.అంటే జనాన్ని మానసికంగా తయారు చేయడం అన్నమాట.దాని కొనసాగింపుగా ఎల్లో మీడియా దీనిని భుజాన వేసుకుని సంక్షేమంలో చాలా వృదా అవుతోందని అనర్హులకు స్కీములు వెళుతున్నాయని  ప్రచారం మొదలుపెట్టారు.అవన్ని అర్జంట్ గా మార్చేయాలని అంటున్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే  ఇదే ఎల్లో మీడియా జగన్ పై శరాలను వదిలి, జాకీలుపెట్టి టీడీపీని లేపడానికి యత్నించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగానే ఆ హామీలన్నీ అమలు అవుతాయేమో అన్నంతగా నమ్మేలా ప్రచారం చేశారు. 

ఇప్పుడేమో యధా ప్రకారం వారి శైలిలో అదంతా వృధా ఖర్చు. వాటిలో కోత  పెట్టాలి అంటూ వాదన తీసుకు వస్తున్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు టీమ్ కాని, ఎల్లో మీడియాకాని అమరావతిలో మాత్రం అప్పులు చేసి అయినా  లక్షల కోట్లు వ్యయం చేయాలని చెబుతున్నారు.మరి అది ఎవరి ప్రయోజనాల కోసం?ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీల గురించి అడగకుండా, పిఆర్సి, బకాయిల చెల్లింపు మొదలైనవాటి గురించి అడగకుండా ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైన  బెదిరింపులు చేశారా అన్న అనుమానం వస్తుంది.

జీతాలు ఇస్తే చాలు.. ఉద్యోగాలు ఉంటే చాలు అన్న అభిప్రాయం కలిగిస్తే ఏ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల తరపున  డిమాండ్ల ఊసెత్తడానికి గజగజలాడడానికి ఈ కధనాలు సృష్టించినట్లుగా ఉంది. ప్రజలు సంక్షేమ హామీల గురించి అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపైనే మాట్లాడుకోవాలన్నదే వీరి లక్ష్యం. ఏరు దాటేవరకు  ఓడ మల్లన్న, ఏరు  దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కూటమితో పాటు ఎల్లో మీడియా పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.  ఏది ఏమైనా ఈ కధనాలను చూస్తే  ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారని అనుకోవల్సిందేనా?

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement