వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు! | KSR Comment: Eenadu magazine has gone down a notch for Jagan | Sakshi
Sakshi News home page

వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!

May 23 2025 10:52 AM | Updated on May 23 2025 12:31 PM

KSR Comment: Eenadu magazine has gone down a notch for Jagan

ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్‌ టిష్యూ పేపర్‌తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. 

సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్‌, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. 

ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్‌లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్‌కు భజన , వైఎస్సార్‌సీపీ, జగన్‌పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది.

 

👉వైఎస్‌ జగన్‌(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి  జగన్ పై తప్పుడు కేసులు  పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర  ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 

👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చం‍ద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్‌ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్‌ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. 

సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్‌లో అనిల్  అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్‌లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?.  

అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్‌ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే  మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. 

యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. 

పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 

👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. 

జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన  కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. 

సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్‌లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్  కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు  ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము  రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు  ప్రభుత్వంతో చెప్పించమనండి!!. 

రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు  వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు  మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement