Komatireddy Venkat Reddy కాంగ్రెస్‌లో మళ్లీ కోమటిరెడ్డి కాక!

Komatireddy Venkat Reddy Comments On Revanth Reddy - Sakshi

పార్టీ తొలి పీఏసీ భేటీకి ఎంపీ వెంకట్‌రెడ్డి గైర్హాజరు 

రేవంత్‌ తీరుపై అసంతృప్తి 

హుజూరాబాద్‌ ఎన్నికను పట్టించుకోవడంలేదనే ఆవేదన 

సాక్షి, హైదరాబాద్‌: ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ కాక పుట్టించారు. సన్నిహితుల వద్ద ఘాటువ్యాఖ్యలు చేసి మరోమారు హాట్‌టాపిక్‌గా మారారు. శనివారం జరిగిన రాష్ట్ర పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) తొలి సమావేశానికి గైర్హాజరై తన అసంతృప్తిని సంకేతాత్మకంగా వ్యక్తం చేశారు. పీఏసీ సమావేశం జరిగిన రోజున ఆయన హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్నా గాంధీభవన్‌కు వెళ్లకపోవడం గమనార్హం.
చదవండి: జగ్గారెడ్డి పంచాయితీ.. కాంగ్రెస్‌లో టీ కప్పులో తుపానే..! 

ముఖ్యంగా హుజూరాబాద్‌ ఉపఎన్నిక విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సరిగా వ్యవహరించడంలేదనే భావనలో ఆయన ఉన్నారు. ‘హుజూరాబాద్‌లో ఎంపీలుసహా అందరికీ కనీసం ఒక గ్రామం చొప్పున అప్పగిస్తే ఎన్నికల పనిచేసుకుని పోతాం కదా?  రేప్పొద్దున అక్కడ డిపాజిట్‌ పోతే పార్టీ కేడర్‌కు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి’అనే ఆందోళనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో టీపీసీసీకి స్పష్టత లేకపోవడంతోనే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావే శానికి వెళ్లలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. 

ఆ పార్టీలతో కలసి వెళ్తే నష్టం..
మళ్లీ సీపీఐ, సీపీఎం, టీడీపీలను వెంటబెట్టుకుని వెళితే కాంగ్రెస్‌ ఛరిష్మా దెబ్బతింటుందని, కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందనే భావనలో ఎంపీ కోమటిరెడ్డి ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో చేర్చుకునే నేతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సీనియర్‌ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరైంది కాదని, ఈ విషయాలన్నింటిపై చర్చ జరగకుండా పీఏసీ భేటీ ఎందుకని ఆయన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.

పార్టీ అధికార ప్రతినిధుల నియామకంలో కూడా సీనియర్లు, పార్టీ ప్రజాప్రతినిధులను సంప్రదించలేదని, కుటుంబవిషయాల్లో కేసులున్న వ్యక్తులను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తే, ఇతర పార్టీలు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్తామని అన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో దళిత–గిరిజన దండోరా సభ పెట్టింది ఒక నాయకుడైతే, ఆ సభ అధ్యక్షత ఇంకొకరికి అప్పగించారని, ఇలా చేయడం సరైంది కాదని, ఇలాంటి విషయాలన్నింటిలోనూ మార్పురావా లని ఆభయన భావిస్తున్నారు.

వచ్చేవారంలో  సోనియా, రాహుల్‌లను కలసి రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, టీపీసీసీ పనితీరు గురించి వివరిం చాలని యోచిస్తున్నట్టు సమాచారం. కాగా, ఆయన సోదరుడు,  ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా పీఏసీ సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top