పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి రెడీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy Meet With Kc Venugopal - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం జరిగింది. రేపు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి చేరనున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై కూడా పోటీకి రెడీ అన్నారు.

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో  ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి  వ్యాఖ్యానించారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.

ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్‌ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది.
 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top