వరి కొనకుంటే కేసీఆర్‌కు ఉరే..

KCR Shelved Pranahita Chevella And Palamuru-RR Projects: Revanth - Sakshi

పరిగి సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

చేవెళ్ల– ప్రాణహితను రద్దు చేసి మోసం చేశారు 

‘పాలమూరు’ కట్టలేమంటూ  కోర్టులో అఫిడవిట్‌ వేశారు 

రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని వెల్లడి 

వికారాబాద్‌/పరిగి:  యాసంగిలో రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని.. లేకుంటే సీఎం కేసీఆర్‌కు మిగిలేది ఉరేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని.. అంతా కలిసి సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘మన ఊరు – మన పోరు’బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. ఆ పంటను కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కేసీఆర్‌ కూడా తన ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ పంటను ఎవరు కొంటరో.. వారు పేద రైతుల వరిని కొనాల్సిందే. రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా ఉంటుంది. పంటకోతకు వచ్చినప్పుడు వేలమంది కార్యకర్తలు, రైతులు కలిసి కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ను ముట్టడిద్దాం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంటే కేవలం రూ.10 వేల కోట్లతో రైతుల పంటను కొనొచ్చు. కానీ ఈ సన్నాసులకు మంచి ఆలోచనలు రావు. 

చేవెళ్ల, వికారాబాద్‌ అభివృద్ధి ఏది? 
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కొండా వెంకటరంగారెడ్డి, దేశ రాజకీయాలను శాసించిన మర్రి చెన్నారెడ్డి వంటివారు వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని ఏలారు. అటువంటి ప్రాంతం ఇప్పుడు రంజిత్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి సన్నాసుల పాలైంది. వాళ్లు చేవెళ్లకు గోదావరి నీళ్లు తెస్తారని ఎట్లా అనుకుంటాం? చేవెళ్లనేమో కొండపోచమ్మలో కలిపారు. చేవెళ్ల చెల్లెమ్మ (మంత్రి సబితా ఇంద్రారెడ్డి)ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మరి ఇంతవరకు ఏం అభివృద్ధి జరిగింది? మీకు మంత్రి పదవి, మీ కుమారుడికి డబ్బులు తప్ప.. ప్రజలకు ఏం ఒరిగింది. గోదావరి జలాలతో పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతా అని కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పితే ప్రశ్నించేందుకు మీకు మాటలు రావా? ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ తెస్తే.. రద్దు చేసింది కేసీఆర్‌ కాదా? దమ్ముంటే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు వేసి చెప్పాలె. 

పాలమూరు కట్టలేం అంటున్నరు 
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మెదక్‌ జిల్లాకే పరిమితం చేసింది నిజం కాదా కేసీఆర్‌..? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కొడంగల్‌ వరకు తెస్తానంటే ఎవరూ వద్దనలేదు. స్వయంగా కేసీఆరే వద్దన్నాడు. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డినీ పడావు పెట్టిండు. ఇక ఈ ప్రాజెక్టు కట్టబోమని కోర్టులో అఫిడవిట్‌ వేసిం డు. 2014లో సీఎం అయ్యాక కేసీఆర్‌ చెప్పినట్టు మూడేళ్లలో పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తర్వాత ఏపీ పెట్టిన కేసుల వల్ల ఆ ప్రాజెక్టు ఆగింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యా యం జరుగుతోందని.. వందల మంది ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం. కేసీఆర్‌ను నమ్మి రెండుసార్లు సీఎంని చేస్తే.. నీళ్లేమో ఏపీకి.. నిధులేమో మేఘా కుటుంబానికి పోయాయి. నియామకాలేమో కేసీఆర్‌ ఇంటిల్లిపాదికి వచ్చాయి. మరి తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరులకు, రైతులకు ఏం వచ్చింది?’’అని రేవంత్‌ నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్, అద్దంకి దయాకర్‌ పాల్గొన్నారు. సభకు ముందు రోడ్‌షో నిర్వహించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top