
సమావేశంలో మాట్లాడుతున్న కారుమూరి
చౌక దుకాణాల వద్ద జనం పడిగాపులు
క్యూలో నిల్చోలేక ప్రాణాలు కోల్పోతున్న వృద్ధులు
ప్రజలకు ఏది బాగున్నా.. చంద్రబాబుకు నచ్చడం లేదు
మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
తణుకు అర్బన్: రేషన్ వాహనాల రద్దు.. ప్రజలకు చంద్రబాబు పొడిచిన మరో వెన్నుపోటు అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు బాధపడుతుంటేనే చంద్రబాబుకు ఇష్టమని, వారికి ఏది బాగున్నా.. ఆయనకు నచ్చదని, ఆయన కన్నుకుడుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాల రద్దుతో ప్రజలు చౌక దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో రేషన్ బియ్యం కోసం క్యూలో ఉన్న వృద్ధురాలు ఎండ వేడికి తట్టుకోలేక ప్రాణం కోల్పోయిందని, ఈ పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.
రేషన్ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాకు సర్కారే తెరలేపిందని, ప్రారంభించిన రోజే విశాఖపట్నంలో 40 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేలాది కుటుంబాల ఉపాధిని దెబ్బతీసిందని, వలంటీర్లు, మద్యం దుకాణాల్లో గుమాస్తాలు, రేషన్ వాహనాల డ్రైవర్లను, అసిస్టెంట్‌లను తొలగించిందని విమర్శించారు. రేషన్ వాహనాల రద్దుతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలను ఎత్తుకుని మహిళలు కొండలు, కోనల్లో నడుచుకుంటూ చౌక దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పండించిన పంటలకు సరైన ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని కారుమూరి కార్యకర్తలను కోరారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని గతంలో మంత్రి నారా లోకేశ్ అనేవారని, ఇప్పుడు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను ఆయన పగలగొడతారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.