మాస్టర్ ప్లాన్ లీడర్ల కొంప ముంచుతుందా? ఆ నేతకు టికెట్‌ కష్టమేనా! బీఆర్‌ఎస్‌ పరిస్థితేంటి?

Kamareddy Master Plan Issue Which Party Gains Mileage BJP BRS Congress - Sakshi

రెండు నెలల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రకటించినప్పటినుంచీ పట్టణం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉంది. ఈనెల 4వ తేదీన అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్యతో... రైతుల నిరసనల పర్వం కాస్తా ఉద్రిక్తంగా కూడా మారింది. రైతుల ధర్నాలు, ఆందోళనలకు బీజేపి, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం ప్రకటించడమే గాకుండా..వెనుకుండి నడిపించడంలో తమ పార్టీల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది వాస్తవం.

అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడి పోయిందనే ప్రచారం ఊపందుకుంది. రైతు ధర్నాల్లో స్వయానా షబ్బీర్ అలీ.. కోదండరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి వంటివారితో కలిసి పాల్గొన్నా.. సంఘీభావం ప్రకటించినా... బీజేపీకి వచ్చిన మైలేజ్ ను మాత్రం కాంగ్రెస్ పార్టీ పొందలేకపోయిందన్న ప్రచారం కామారెడ్డిలో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో కామారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న షబ్బీర్ అలీకి ఈ పరిణామాలు కొంత నిరాశాజనకమే అనే చర్చ నడుస్తోంది. 

కమలం రూటు కరెక్టేనా?
మరోవైపు మాస్టర్ ప్లాన్ అంశాన్నే కమలం పార్టీ భుజానికెత్తుకుని సక్సెస్ అయిందనే టాక్ కామారెడ్డిలో నడుస్తోంది. బీజేపి కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి రైతుల ఇష్యూను సజీవంగా ఉంచుతూ... వారి వెనుకుండి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మాట ఆందోళనల సమయంలో పలుమార్లు పోలీసుల నోటే వినిపించడం విశేషం.

రమణారెడ్డి.. రైతు ఐక్య కార్యాచరణ మీటింగ్స్ కు ప్రతీసారీ హాజరుకావడం.. రైతుల పక్షాన మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ...అన్నీ తానై నడిపించడంతో..రమణారెడ్డి రాజకీయం ముందు కాంగ్రెస్ తేలిపోయిందనే వాదన బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న రమణారెడ్డి..రైతుల భూముల వ్యవహారాన్ని తన సొంత అజెండాగా చేసుకుని.. గిరి గీసి బరిలోకి దిగడంతో బీజేపీకి మైలేజ్ ఎక్కువే వచ్చిందన్నది కాషాయ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కామారెడ్డి తీసుకువచ్చిన రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేయడంతో.. రాజకీయంగా బీజేపీ పేరే ఎక్కువ వినిపించేలా చేసుకోగల్గారు. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వస్తారని ప్రచారం జరిగినా... ఆయన రాకపోవడంతో షబ్బీర్ అలీపై అనుమానాలకు ఆయనే తెర లేపినట్టైంది. షబ్బీర్కు సంబంధించిన భూములు కూడా కామారెడ్డి చుట్టుపక్కల చాలా ఉండటంతో.. ఈ వివాదంలో ఎక్కువ తలదూర్చొద్దనే భావనతోనే రేవంత్ ను రాకుండా అడ్డుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కారుకు ఎందుకు సంకటం?
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారాన్ని అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మలచడంలో కమలం పార్టీ సక్సెస్ అయిందనే టాక్ నడుస్తోంది. అదే సమయంలో ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫెయిల్ అయ్యారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. స్థానిక ప్రజలు మాస్టర్ ప్లాన్ విషయంలో అధికార, ప్రతిపక్షాల వైఖరిపై చర్చించుకుంటున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top