
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆశీల్‌మెట్టలోని కాన్వొకేషన్ హాలులో శనివారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అవినీతిపై ఇప్పటికే సీబీఐకి ఫిర్యాదు చేశానని, కొన్ని ఆధారాలు కూడా అందజేసినట్టు తెలిపారు. మరిన్ని ఆధారాలను త్వరలో అప్పగిస్తానన్నారు.
రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా చంద్రబాబు మార్చారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రాష్ట్రం సింగపూర్ చేస్తానని చెప్పి సర్వనాశనం చేశాడని విమర్శించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అప్పగించాడన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. రాష్ట్రం బాగు కోసమే ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ పేరుతో యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేయగా.. తిరస్కరించానని చెప్పారు.