
సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ ఉత్తరం రాస్తే దాన్ని తప్పుపట్టిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని సీఎస్‌కు లేఖ రాశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ నిలదీశారు. ఒక ఆధారం అయినా ఇవ్వండి అని డీజీపీ అడిగితే, అడగటానికి డీజీపీ ఎవరు అని ప్రశ్నించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► ఎటువంటి ఆధారం, సమాచారం లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలి. ఒక పత్రిక పిచ్చి రాతలు రాస్తే.. దాన్ని పట్టుకుని ప్రధానికి లేఖ రాయటం చూస్తుంటే చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవం ఏమైందనే అనుమానం కలుగుతోంది. అసలు ఆయన బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడేనా?
► బాధ్యతగల సామాన్య పౌరులే ఆధారాలు చూపుతారు. అలాంటిది ప్రతిపక్ష నేతగా, రాజకీయాల్లో ఎంతో సీనియర్ అని చెప్పుకునే బాబుకు సామాన్య పౌరుడికి ఉన్న జ్ఞానం కూడా లేకపోవటం ఆశ్చర్యం.
► సైనికుల్లా పని చేస్తున్న 4 లక్షల మంది వలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బందిని కించపరిచేలా మాట్లాడుతున్న లోకేష్‌ను చంద్రబాబు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలిపించుకోలేరు. వార్డు మెంబర్‌గా లోకేష్‌ను పోటీ చేయిస్తే, వలంటీర్‌ను పెట్టి గెలిపించుకుంటాం. ఈ సవాల్‌ను బాబు స్వీకరించాలి. ఇటువంటి లోకేష్‌ను చంద్రబాబు నాలుగు శాఖలకు మంత్రిని, టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు.
► చంద్రబాబు శిఖండిలా అడ్డుపడినా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. చంద్ర విఘ్నాలను అధిగమిస్తాం. గత ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టినా బాబుకు జ్ఞానం రాలేదు.
► భూముల్లో ఆవగింజంత అవినీతి కూడా జరగలేదు. అవినీతి గురించి బాబు మాట్లాడటం సిగ్గుచేటు. స్కాం బాబు అంటే నారా బాబు. ఏటీఎం బాబు, సూట్ కేసు బాబు అంటే లోకేష్ బాబే. జూమ్ మీటింగ్‌లకు తప్ప బాబు ఏపీకి పనికి రాడు అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.