బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి | AP High Court responded to Suvarnaraj petitions about Chandrababu Cases | Sakshi
Sakshi News home page

బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి

Jan 1 2026 3:09 AM | Updated on Jan 1 2026 3:09 AM

AP High Court responded to Suvarnaraj petitions about Chandrababu Cases

సువర్ణరాజు పిటిషన్లపై స్పందించిన హైకోర్టు

పూర్తి వివరాలను న్యాయస్థానం ముందుంచాలని సీఐడీకి ఆదేశం 

ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్ల విచారణకు స్వీకరణ 

విచారణ వచ్చే వారానికి వాయిదా 

చంద్రబాబు కుంభకోణాలపై నమోదైన కేసుల్లో డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ 

దీనిపై హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేసిన సువర్ణరాజు 

ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై నమోదైన కేసులను సీఐడీ మూసేస్తోంది 

ఇప్పటికే ఐదారు కేసులను అలా మూసేసింది 

మూసివేత ఉత్తర్వుల కాపీలను కూడా బయటకు రానివ్వడం లేదు 

న్యాయం కోసం థర్డ్‌ పార్టీగా ఆ కేసుల్లో అన్ని డాక్యుమెంట్లు అడుగుతున్నాం 

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరు­లు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న 2014­–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ నమోదుచేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సువర్ణరాజు దాఖ­లు చేసిన మూడు రివిజన్‌ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం–నిందితుల మధ్య అపవిత్ర బంధం
ఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ పెట్టిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈనెల 5న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసి, అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సువర్ణరాజు హైకోర్టులో ఇటీవల క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ లక్ష్మణరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం, నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందన్నారు. 

ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసులను అన్యాయంగా, దారుణంగా మూసేస్తున్నారని.. ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు. అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడంలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడంలేదని తెలిపారు. వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు. థర్డ్‌ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్‌ డాక్యుమెంట్లేనని తెలిపారు.  

న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాం
సీఐడీ తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పాణిని సోమయాజీ జోక్యం చేసుకుంటూ.. థర్డ్‌ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవ­సరం లేదన్నారు. థర్డ్‌పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. కేసుల మూసివేతపై హైకో­ర్టులో రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేసేందు­కు కోరుతున్నామని సుధాకర్‌రెడ్డి బదులిచ్చా­రు. కేసుల మూసివేతపై థర్డ్‌ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరంలేదని, హైకో­ర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన చెప్పారు. న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలి­పారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement