breaking news
suvarnaraju
-
బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ నమోదుచేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సువర్ణరాజు దాఖలు చేసిన మూడు రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం–నిందితుల మధ్య అపవిత్ర బంధంఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ పెట్టిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈనెల 5న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసి, అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సువర్ణరాజు హైకోర్టులో ఇటీవల క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ లక్ష్మణరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం, నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను అన్యాయంగా, దారుణంగా మూసేస్తున్నారని.. ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు. అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడంలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడంలేదని తెలిపారు. వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు. థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లేనని తెలిపారు. న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాంసీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజీ జోక్యం చేసుకుంటూ.. థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్‌పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. కేసుల మూసివేతపై హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. కేసుల మూసివేతపై థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరంలేదని, హైకోర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన చెప్పారు. న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
ఆశల దీపం ఆరిపోయింది
- కొల్లేరు వలస కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు - పూణే రోడ్డు ప్రమాదంలో దెయ్యంపాడు యువకుడు మృతి - మృతుడి తండ్రి, సోదరికీ తీవ్ర గాయాలు ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ పొట్టకూటి కోసం వలస పోయారు. కొడుకును ఇక్కడే ఉంచి చదివిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. చదువుకు కావాల్సిన డబ్బు కోసం తండ్రి దగ్గరకు వెళ్లిన కొడుకును ఆయిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు పడిన రోదన చూసి ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. కైకలూరు: మండవల్లి మండలం దెయ్యంపాడు గ్రామానికి చెందిన జయమంగళ నాగభూషణం, సత్యవతి దంపతులకు కుమారుడు సువర్ణరాజు (21), కుమార్తె జ్ఞానసుందరి ఉన్నారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత చేపల వేట నిమిత్తం మహారాష్ట్రలో పూణేకు వలసవెళ్లారు. కుమారుడు సువర్ణరాజు ఏలూరులో బీఎస్సీ చదువుతున్నాడు. రెండేళ్ల కిత్రం జ్ఞానసుందరికి వివాహం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సువర్ణరాజు ఫీజు కట్టలేదు. తండ్రికి పనుల్లో సాయపడి ఫీజుకు డబ్బు సంపాదించుకుందామని కొద్దినెలల క్రితం పూణే వెళ్లాడు. అతని సోదరి జ్ఞానసుందరి, ఆమె భర్త ఘంటసాల దావీదురాజు, వారి కుమార్తె ఏంజిల్ కూడా పూణే వచ్చారు. అందరూ కలిసి గురువారం సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని రాజివాడ సెంటర్ ఇందాపూర్ వద్ద నుంచి సోలాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లడానికి బొలోరా వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో తండ్రి నాగభూషణం, సోదరి సుందరి, బావ దావీదురాజు, దగ్గర బంధువు దైవకుమార్ ఉన్నారు. సువర్ణరాజు తన సామగ్రిని వాహనం డిక్కీలో పెడుతుండగా, అటుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. రెండు వాహనాల మధ్య నలిగి సువర్ణరాజు మరణించాడు. తండ్రి నాగభూషణంకు చేయి విరిగింది. సోదరి తలకు తీవ్రగాయమైంది. దైవకుమార్కు గాయాలయ్యాయి. దావీదురాజు, ఏంజిల్ ముందు కూర్చోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోస్టుమార్టం నిర్వహించి సువర్ణరాజు మృతదేహాన్ని శుక్రవారం దెయ్యంపాడు తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. విలపించిన స్నేహితులు తమతో కలిసి చదువుకున్న స్నేహితుడు ఇక లేడని తోటి స్నేహితులు బోరున కంటతడి పెట్టారు. పేదరికం చదువుకు అడ్డుకాకుడదని ఎంతో కష్టపడి చదివే మనస్తత్వం సువర్ణరాజుది అని వాపోయారు. అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సంతాపం వ్యక్తం చేశారు.


