ఆశల దీపం ఆరిపోయింది
మండవల్లి మండలం దెయ్యంపాడు గ్రామానికి చెందిన జయమంగళ నాగభూషణం, సత్యవతి దంపతులకు కుమారుడు సువర్ణరాజు (21), కుమార్తె జ్ఞానసుందరి ఉన్నారు.
- కొల్లేరు వలస కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు
- పూణే రోడ్డు ప్రమాదంలో దెయ్యంపాడు యువకుడు మృతి
- మృతుడి తండ్రి, సోదరికీ తీవ్ర గాయాలు
ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ పొట్టకూటి కోసం వలస పోయారు. కొడుకును ఇక్కడే ఉంచి చదివిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. చదువుకు కావాల్సిన డబ్బు కోసం తండ్రి దగ్గరకు వెళ్లిన కొడుకును ఆయిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు పడిన రోదన చూసి ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు.
కైకలూరు: మండవల్లి మండలం దెయ్యంపాడు గ్రామానికి చెందిన జయమంగళ నాగభూషణం, సత్యవతి దంపతులకు కుమారుడు సువర్ణరాజు (21), కుమార్తె జ్ఞానసుందరి ఉన్నారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత చేపల వేట నిమిత్తం మహారాష్ట్రలో పూణేకు వలసవెళ్లారు. కుమారుడు సువర్ణరాజు ఏలూరులో బీఎస్సీ చదువుతున్నాడు. రెండేళ్ల కిత్రం జ్ఞానసుందరికి వివాహం చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో సువర్ణరాజు ఫీజు కట్టలేదు. తండ్రికి పనుల్లో సాయపడి ఫీజుకు డబ్బు సంపాదించుకుందామని కొద్దినెలల క్రితం పూణే వెళ్లాడు. అతని సోదరి జ్ఞానసుందరి, ఆమె భర్త ఘంటసాల దావీదురాజు, వారి కుమార్తె ఏంజిల్ కూడా పూణే వచ్చారు. అందరూ కలిసి గురువారం సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని రాజివాడ సెంటర్ ఇందాపూర్ వద్ద నుంచి సోలాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లడానికి బొలోరా వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో తండ్రి నాగభూషణం, సోదరి సుందరి, బావ దావీదురాజు, దగ్గర బంధువు దైవకుమార్ ఉన్నారు.
సువర్ణరాజు తన సామగ్రిని వాహనం డిక్కీలో పెడుతుండగా, అటుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. రెండు వాహనాల మధ్య నలిగి సువర్ణరాజు మరణించాడు. తండ్రి నాగభూషణంకు చేయి విరిగింది. సోదరి తలకు తీవ్రగాయమైంది. దైవకుమార్‌కు గాయాలయ్యాయి. దావీదురాజు, ఏంజిల్ ముందు కూర్చోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోస్టుమార్టం నిర్వహించి సువర్ణరాజు మృతదేహాన్ని శుక్రవారం దెయ్యంపాడు తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
విలపించిన స్నేహితులు
తమతో కలిసి చదువుకున్న స్నేహితుడు ఇక లేడని తోటి స్నేహితులు బోరున కంటతడి పెట్టారు. పేదరికం చదువుకు అడ్డుకాకుడదని ఎంతో కష్టపడి చదివే మనస్తత్వం సువర్ణరాజుది అని వాపోయారు. అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సంతాపం వ్యక్తం చేశారు.


