
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పతనమయ్యిందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. వైఎస్సార్‌సీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పచ్చి అబద్ధం చెప్పిన విషయం కలెక్టర్ కార్యాలయం స్పష్టత ఇవ్వడంతో బయటపడింది. పైగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి డైరెక్షన్‌లోనే ఇది జరిగిందని సమాచారం.
ఈ నెల 15వ తేదీన వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజున మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ పర్యటిస్తున్నారంటూ పోలీసులు వైఎస్సార్‌సీపీ సమావేశానికి అడ్డుపడ్డారు. పైగా సమావేశం నిర్వహించుకోవడం కుదరదంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాశారు. సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేరుతో లేఖ అందజేశారు. ఈ విజ్ఞప్తితో 18వ తేదీకి సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ వాయిదా వేసింది. తీరా చూస్తే..
తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగింది సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పోనీ దానికి మంత్రుల్లో ఒక్కరైనా వచ్చారా? అంటే అదీ లేదు. కేవలం లోకల్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఈలోపు అసలు 15వ తేదీన మంత్రుల షెడ్యూల్ లేదని కలెక్టరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం వైఎస్సార్‌సీపీ సమావేశం వాయిదా వేయించేందుకు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ చిల్లర డ్రామాకు తెర తీశారు. ఆయన డైరెక్షన్‌లో తాడిపత్రి పోలీసులు ఈ డ్రామా ఆడినట్లు ఇప్పుడు తేలింది.

ఇదీ చదవండి: నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి