సాక్షి, విజయవాడ: ఏపీలో 18 నెలలుగా దళితుల మారణహోమం జరుగుతోందని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. దళితుల పట్ల దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎక్కడికి పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. ఇదే ఘటన మరో కులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కందుకూరులో కాపు-కమ్మలకు మధ్య దాడి జరిగితే హోం మంత్రి అనిత పరుగు పరుగున వెళ్లారు. పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మీరు వాళ్లకు సపోర్ట్ చేశారా?. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. తుని దుర్ఘటనలో 60 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపేస్తే.. చెరువులో దూకేశాడని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో ఆడవాళ్లను బట్టలు తీసేని డ్యాన్స్‌లు చేయమన్న జనసేన నేతను ఎందుకు అరెస్ట్ చేయలేదు?. జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు మీకు కనబడవా?. ప్రతీ కేసులో అరెస్టులు చేసి రోడ్ల పై నడిపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్ అని హడావిడి చేస్తున్నారు. కేసు విచారణలో నిర్దోషిలుగా తేలితే వారి గౌరవాన్ని తిరిగి మీరు ఇవ్వగలరా?.
పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త చట్టాలు ఇవేనా?. మీరు ఎంత రోడ్లపై నడిపిస్తే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపిస్తే చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 60 శాతం మంది బాధితులు దళితులే. గ్రామాల్లోని నాయకుల ఇళ్లపై వేరే పార్టీ జెండాలు ఎగరేస్తే ఊరుకోవడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు ఎగరకపోతే వారిని బహిష్కరిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఇదేనా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. కూటమి కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలి.
యరపతినేనిపై కేసు కట్టాలి..
సామాన్య కార్యకర్త చనిపోయాడని ఎమ్మెల్యే యరపతనేని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఏపీలో మర్డర్ చేస్తే మాట్లాడే వాడు లేడు. అత్యాచారం చేస్తే అడిగేవాడు లేడు. సాల్మన్ హత్య కేసులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడు. తక్షణమే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలి. 18 నెలల కూటమి పాలనలో 276 మంది దళిత ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి సమాధుల వద్దకు కూడా కుటుంబ సభ్యులను వెళ్లనివ్వడం లేదు. కుటుంబసభ్యులను కూడా రానివ్వకుండా పోలీసులే దహన సంస్కారాలు చేసేయడమేంటి?. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలి
దళితులకు, ఆడబిడ్డలకు ఏం జరిగినా పరుగు పరుగున వస్తానని పవన్ చెప్పారు.. ఇప్పుడు ఏమైపోయారు?. సాల్మన్ కుటుంబానికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సహా హత్యకు కారకులైన వారిపై 302 సెక్షన్ పెట్టాలి. లేనిపక్షంలో బాధితుల పక్షాన కోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం. యరపతినేని శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఇప్పుడు తప్పించుకున్నా 2029లోనైనా యరపతినేని తప్పించుకోలేడు. ఈ కేసులో మా వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత ఉద్యమం తప్పదు
లోకేశ్ శాశ్వతంగా దావోస్‌కే..
లోకేష్ ఇప్పటికైనా మారకపోతే.. భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. ఇప్పుడు నెలకొకసారి నారా లోకేష్ దావోస్‌కి వెళుతున్నాడు
ఒక్కసారి ప్రభుత్వం మారితే నారా లోకేష్ పర్మినెంట్‌గా దావోస్‌కి పారిపోవడమే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం కోల్పోయిన పరిస్థితి తర్వాత మీ పరిస్థితి ఏంటి?. తాటతీస్తా.. ఒంగోబెట్టేస్తా.. నారతీసేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. సనాతన ధర్మాధికారి పవన్‌కు జనసేన నేతల చర్యలు కనిపించడం లేదా?. దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మానప్రాణాలను కాపాడతానని పవన్ కబుర్లు చెప్పారు.
పవన్ ఏం చేశారు..
భారతదేశంలో ఈ స్థాయిలో కోడి పందాలు ఎప్పుడూ జరగలేదు. మీకు 164 సీట్లు ఇస్తే మందులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీ చూపించారు. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రికార్డింగ్ డ్యాన్స్‌లు వేశారు. రాజకీయాలను మార్చడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఏం మార్చారు. ఇంతకుముందు కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. గతం కంటే ఎక్కువ జూదం జరిగింది.. ఎక్కువ క్యాసినోలు జరిగాయి. క్యాసినో పేరుతో కొడాలి నానిపై వారం రోజులు డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు పెట్టిన క్యాసినోలు మీకు కనిపించడం లేదా?.


