సీఎం నిర్ణయాలే ఫైనల్‌.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్? | Sakshi
Sakshi News home page

సీఎం నిర్ణయాలే ఫైనల్‌.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?

Published Fri, May 24 2024 4:59 PM

Internal Differences Between CM Revanth Reddy And Congress?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పార్టీ నాయకత్వానికి ముందు చెప్పడంలేదా? తానే పీసీసీ చీఫ్ కావడంతో పార్టీకి చెప్పక్కర్లేదని రేవంత్ అనుకుంటున్నారా? సమాచారం తెలియకే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారా? పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెరగడానికి కారణం ఏంటి? 

గత కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందు కనీసం పార్టీలో సీనియర్లతో అయినా చర్చించరా అంటూ అవేదన వెళ్ళగక్కుతున్నారు. ఏ అంశం మీదైనా ప్రభుత్వం సడెన్‌గా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గుడ్డిగా సమర్దించాలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట సదరు సీనియర్‌ నేతలు.

కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చినట్లుగా అవుతోంది. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా బదులివ్వాలి కదా అని ముఖ్యమంత్రి రేవంత్‌ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అనడంతో.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మాకు ముందుగా చెబుతున్నారా అని సీఎంఓ కార్యాలయంలోని ఆ నేతను ప్రశ్నించారట సీనియర్లు. 

మూడు రోజుల క్రితం సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు  కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడంతో, దొడ్డు వడ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తున్నారు.

 అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్నస్థాయిలో కౌంటర్స్‌ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకు మాట్లాడటంలేదని అడిగితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేముందు మాకు కనీస సమాచారం అయినా ఇస్తే.. దాని వల్ల తలెత్తే ఇబ్బందులను అంచనా వేసుకుని ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధం అవుతాం కదా అని రివర్స్‌ అవుతున్నారట కొందరు సీనియర్ 

వరి ధాన్యం కొనుగోలు విషయం మాత్రమే కాదు, రైతు బంధు, కరెంటు వంటి పలు విషయాలలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలను కౌంటర్‌ చేయడానికి తమకు సమాచారం ఇచ్చేవారే లేరని పార్టీ నాయకులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే సీఎం కావడంతో ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు సీఎం రేవంత్‌ను కలవడానికి అవకాశం లేకుండాపోతోంది. 

దీంతో విపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తోచక, తమకు ఎందుకులే అనుకుని కొందరు నేతలు సైలెంట్‌ అవుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఎవరైనా సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే సీఎంకు సలహా ఇచ్చారట. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం సహజంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కాని టీ.కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడంలేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి ఓ నేత ఉండేవారు. ఏదైనా అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందో లేక తర్వాతో..పార్టీ తీసుకోవాల్సిన లైన్‌పై నాయకులకు క్లియర్‌గా వివరించేవారు. అయితే ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

అందుకే వీలైనంత త్వరగా పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసేందుకు సీఎం రేవంత్‌కు సన్నిహతుడైన ఓ కీలక నేతకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయనకే సమన్వయం బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement