
బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రపై అసమ్మతి
అధ్యక్షుడిని మారుస్తాంటూ ప్రచారం
కొడుకును కాపాడేందుకు 'యెడ్డీ' ప్రయత్నాలు
కర్ణాటకలో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు గురించే అక్కడి రాజకీయ వర్గాల్లో ఎక్కవగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని కన్నడ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదోరకంగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో చాప కింద నీరులా ప్రతిపక్ష బీజేపీలోనూ ముసలం మొదలైంది. అయితే దీనిపై మీడియా అంతగా ఫోకస్ చేయలేదు.
కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆయన నాయకత్వంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తేలడంతో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విజయేంద్రపై కేంద్ర నాయకత్వానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సీనియర్ నేతలతో సఖ్యతగా ఉండడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీలో సమస్యలు తలెత్తాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రంగం దిగిన 'అప్పా'
కొడుకు పదవికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొనడంతో విజయేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వయంగా రంగం దిగారు. తన కుమారుడిపై స్థానిక నేతలు, క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆయన పయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను సావధానంగా వింటున్నారు. అసంతృప్తులను బుజగించి గ్యాప్ తగ్గించేందును తన అనుభవాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా నాయకత్వం ముందు ప్రసావించడానికి వీలుగా ఒక వేదికను కల్పించేందుకు యడియూరప్ప తిరిగి వచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.
2023 నవంబర్‌లో విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యడియూరప్ప క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొడును గండం నుంచి తప్పించడానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్‌లో ప్రతిరోజు నాయకులు, కార్యకర్తలకు పెద్దాయన అందుబాటులో ఉంటున్నారు. రాజకీయంగా ఆయన ఇంకా చురుగ్గానే ఉన్నారని, గణనీయమైన ప్రభావాన్ని చూపగలరని సన్నిహితులు పేర్కొంటున్నారు.
విజయేంద్రకు వ్యతిరేకంగా పావులు
పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ తదిరత నాయకులు కూడా విజయేంద్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అసమ్మతిని గుర్తించిన అధినాయకత్వం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని (Pralhad Joshi) కర్ణాటకకు పంపించింది. అసమ్మతి నేతలతో ఆయన జరిపిన సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని అంతర్గత వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా విజయేంద్రకే పార్టీ మద్దతుగా నిలిచింది. అసమ్మతి గళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను సస్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.
నాయకత్వ మార్పు తప్పదా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు మొదలయ్యాయి. విజయేంద్ర ఢిల్లీ పర్యటన కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హస్తినలో ఉండడంతో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రతిపక్ష నేతను మార్చే అవకాశం ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది.
చదవండి: స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్!
ఏమైనా జరగొచ్చు..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని మేము అనుకోవడం లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఏమైనా జరగొచ్చు అంటూ మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమల్ని ఎన్నికల మోడ్‌లోకి నడిపించగల వ్యక్తిని అధినాయకత్వం ఎంపిక చేస్తుంద"ని అన్నారు. మరి కొడుకును కాపాడటానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్నది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.