జైలు గోడల మధ్య ప్రజ్వల్‌..‘నేను హైకోర్టుకు వెళతా’అంటూ ఆవేదన.. | how Prajwal Revanna spent on jail first day | Sakshi
Sakshi News home page

జైలు గోడల మధ్య ప్రజ్వల్‌..‘నేను హైకోర్టుకు వెళతా’అంటూ ఆవేదన..

Aug 3 2025 7:36 PM | Updated on Aug 4 2025 3:14 PM

how Prajwal Revanna spent on jail first day

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్‌ కీలక నేత హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రజ్వల్‌ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శిక్షలో భాగంగాప్రజ్వల్‌ తొలిరోజే.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని జైలు సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది.

జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..జీవిత ఖైదు శిక్షలో భాగంగా తొలిరోజు రాత్రంతా ఒత్తిడితో గురయ్యారు. వైద్య పరీక్షల సమయంలో తనకు జైలు శిక్ష పడడంపై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక, ప్రజ్వల్ రేవణ్ణకు జైలు అధికారులు ఖైదీ నంబర్ 15528 కేటాయించారు. రోజువారీ వేతనం రూ. 524 చెల్లించనున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు జైల్లో బేకరీ, తోటపని, హస్తకళలు వంటి విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఇక జైలు నిబంధనల ప్రకారం ప్రజ్వల్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో ఆయన తీవ్ర వేదనకు గురైనా.. ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. మాజీ ఎంపీ కాబట్టి హై-సెక్యూరిటీ సెల్లో ఉంచారు. ప్రిజన్ యూనిఫాం ధరించారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు ఏంటంటే?
కాగా ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్‌పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్‌ గజానన్‌ భట్‌ ఆదేశించారు.

పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని ఈ శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్‌ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్‌ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్‌ను అరెస్ట్‌చేయడం తెల్సిందే.

కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్‌లోనే ఉన్న దోషి ప్రజ్వల్‌ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన మెరిట్‌ విద్యార్థిని. పార్లమెంట్‌ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్‌ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి.

బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్‌ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్‌షీట్‌ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అశోక్‌ నాయక్, అదనపు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బీఎన్‌ జగదీశ చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement