షర్టులు చిరుగుతున్నాయి: హరీష్‌ రావు వ్యంగ్యం | Harish Rao Satires On BJP In Sangareddy | Sakshi
Sakshi News home page

షర్టులు చిరుగుతున్నాయి: హరీష్‌ రావు వ్యంగ్యం

Nov 22 2020 8:12 PM | Updated on Nov 22 2020 8:54 PM

Harish Rao Satires On BJP In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ‘బీజేపీ ఆఫీస్‌లో  కుర్చీలు ఎగురుతున్నాయి, షర్టులు చిరుగుతున్నాయి. మీ మధ్య మీకె సమన్వయం లేదు. ఇక ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు’ అంటూ బీజేపీ నాయకులపై మంత్రి హరీష్‌ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పఠాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చే కేంద్ర మంత్రులకు నేను ఒకటే చెపుతున్నా.. రాష్ట్రానికి  రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడకు రండి. ఛార్జ్ షీట్ అసలు వేయాల్సి వస్తే బీజేపీపై వెయ్యాలి. ఐజీఎస్టీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన  బకాయిలు ఇవ్వకుండా ఉన్నది బీజేపీ పార్టీ. బీఆర్జీఎఫ్  నిధులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపుతున్న పార్టీ బీజేపీ. డిసెంబర్ 1వ తేదీన మీ ఛార్జ్ షీట్‌కు హైదరాబాద్ నగర ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. బెంగుళూరు, గుజరాత్‌లలో వరదలు వస్తే  డబ్బులు ఇచ్చిన బీజేపీ హైదరాబాద్‌కు వరద సహాయం ఎందుకు చేయలేదు?.

హైదరాబాద్ ప్రజల అవస్థలు మీకు పట్టదా అని ప్రశ్నిస్తున్నా?. మీకు హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటేయాలి?. ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు రాకుండా చేసినందుకు మీకు ఓటేయాలా?..  7 మండలాలను ఆంధ్రాలో కలిపినందుకు ఓటేయాలా?.. ఒక్క రూపాయి కూడా వరద సహాయం చేయనందుకు ఓటేయాలా?.. తెలంగాణకు కేంద్రం నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు తెచ్చిన తర్వాతే హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడగాలి. హైదరాబాద్ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే  ప్రజలకు వరద సహాయం కోసం నిధులు విడుదల చేయండి. హైదరాబాద్‌లో వరదలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమంటున్న  కేంద్ర మంత్రి జవదేకర్ ముంబై వరదలకు కారణమేవరో చెప్పాలి. మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ముంబై వరదలకు కారణం ఎవరో  చెప్పాలి?. ( ‘ఎల్‌ఆర్‌ఎస్‌ పోవాలంటే.. టీఆర్‌ఎస్‌ పోవాలి’)

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మొన్నటికి మొన్న కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం భేష్ అని మెచ్చుకుంటే ఈరోజు హైదరాబాద్ వచ్చిన మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనాను కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి  ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వ పథకం  ఫసల్ భీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాల’’ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement