కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి

Published Wed, Oct 4 2023 5:34 AM

Harish Rao comments on Congress and BJP party - Sakshi

గజ్వేల్‌: ‘పీసీసీ అంటేనే పేమెంట్‌ కలెక్షన్‌ సెంటర్‌. బీజేపీని నమ్ముకుంటే అధోగతే. ఈ రెండు పార్టీలను పాతాళంలో పాతర పెట్టాలి. ఉచిత కరెంటు, మూడు పంటలు, ధాన్యపు రాశులు కావాలంటే కేసీఆర్‌ వెంటే నడవాలి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడ్డారు. గత కాంగ్రెస్‌ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులతో క్యూలు కట్టిన రోజులు రైతులు నేటికీ మరిచిపోలేదన్నారు. కరెంట్‌ సక్రమంగా రాక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పుల పాలయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. తప్పుదారి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉచిత కరెంట్‌ ఆగమైతదని రైతులు గుర్తించారని చెప్పారు. బీజేపీ వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ రైతే రాజు అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన గజ్వేల్‌లోనే ఉండాలనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కానుకగా అందించే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్‌ గృహలక్ష్మి పథకం కింద 10 వేల ఇళ్లను మంజూరు చేశారని ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు పలు సంఘాల మద్దతు 
గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. గజ్వేల్‌ ఆర్యవైశ్య సంఘం, కుమ్మరి సంఘం, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్, పద్మశాలి సంఘాలు ఈ మేరకు చేసిన తీర్మానాలను మంత్రి హరీశ్‌రావుకు అందించాయి.

 
Advertisement
 
Advertisement