హైదరాబాదీల బద్ధకంపై జోకులు..!

GHMC Elections 2020: Jokes On Hyderabad Voters Poor Response - Sakshi

గ్రేటర్‌లో మందకొడి పోలింగ్‌పై సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ

ఓటేసేందుకు జనం రాకపోవడంపై పలువురి ఆందోళన, అసంతృప్తి

ఓటేయకపోవడమూ అసమ్మతి ప్రకటనే.. గౌరవిద్దామన్న కొందరు

హైదరాబాదీల బద్ధకంపై జోకులు పేల్చిన మరికొందరు...  

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు నగర ప్రజలు బద్ధకించడం, పోలింగ్‌ ఆద్యంతం మందకొడిగా సాగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ శాతం తగ్గిపోవడం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తే, ఓటేయకపోవడం కూడా అసమ్మతి ప్రకటనే, దాన్ని గౌరవిద్దామని మరికొందరు పేర్కొన్నారు. ఇంకొంతమంది హైదరాబాదీల బద్ధకంపై జోకులను పేల్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగడం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఈ నగరానికి ఏమైంది.. ఎందుకు ఇంత తక్కువ పోలింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ వాళ్లే కాదు, పాతబస్తీలో కూడా ఇంత తక్కువ పోలింగ్‌..’అని నెటిజన్‌ శ్రీశైల్‌రెడ్డి పంజుగుల ఆందోళన వ్యక్తం చేశారు. 

‘ప్రభుత్వాలు తమను ఎన్నుకునే ప్రక్రియ (పోలింగ్‌)లో పాల్గొనని వారికోసం పనిచేస్తా యని జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. సంపన్న వర్గాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని, ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని ఆయన పాలకుల తీరుపై పరోక్షంగా చురకలంటించారు. ‘గలీజు ప్రచారాలకు ఖాండ్రించి ఉమ్మేసిన హైదరాబాద్‌ సగటు ఓటరు’ అని ఆర్‌జేవై నవీన్‌ రాజకీయ పార్టీల వైఖ రిపై మండిపడ్డారు. ‘రూ.10వేల వరద సహాయానికై మీసేవ కేం ద్రాల వద్ద వరద వెల్లువలా పోటెత్తిన సిటిజన్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటెత్తలేదెందుకూ..?’ అని బొగ్గుల శ్రీనివాస్‌ ప్రశ్నించారు.  


సాయంత్రం 6 కాకుండానే నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో మూసి ఉన్న మద్యం దుకాణం ముందు బారులు తీరిన జనం

మొబైల్‌ పోలింగ్‌ బూత్‌లు పెట్టుకోవాలే! 
‘మొబైల్‌ పోలింగ్‌ బూత్‌లు పెట్టుకోవాల్నేమో ఇగ..’ అని వేదుల పవన్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి కొత్త ఐడియా ఇచ్చారు. ‘ఒక్క రెండు గంటలు హైదరాబాద్‌లో నెట్‌ బంద్‌ చేయండ్రి. కలుగులో ఎలుకల్లా పోలింగ్‌ బూత్‌లకు వస్తరని ప్రజల మొబైల్‌ ఫోన్ల వ్యవసనంపై రేగుంట రాజేశ్వర్‌ సెటైర్‌ వేశారు. ‘మిట్ట మిధ్యాహ్నం అవుతున్నా.. నగరం నిద్రపోతున్న వేళ, లేసి ఓటేయకపోతే జనాభా లిస్టులో ఉన్నా లేనట్లే..’అని గోనె మార్కండేయులు హైదరాబాదీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓటేయాలని ఒత్తిడి చేయడం, ఓటేయని వాళ్లను అవమానించడం కూడా ఫాసిజమే. ఓటేయకపోవడం కూడా
నిరసనే..’ అని పి.మోహన్‌ అనే చిత్రకారుడు అభిప్రాయపడ్డారు. 

‘ఓటేయకపోవడం అసమ్మతి ప్రకటనే.. దాన్ని గౌరవిద్దాం.. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోయినా రాజ్యాంగ హక్కులు పౌరులకు అందుతాయి. ఓటేసినా, వేయకున్నా ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. అతిగా ఆవేశపడి వాట్సాప్‌ యూనివర్సిటీల్లో చదువుకున్నట్టు ట్రోలింగ్‌ చేయకండి..’అని అరుణాంక్‌ లత పేర్కొన్నారు. రాజకీయ పార్టీల దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాల తరహాలో కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సరళిపై నెటిజన్లు ప్రజాస్వామ్యంగా, మర్యాదపూర్వకంగా చర్చించుకోవడం విశేషం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top