అందుకే సీఎంను కలిశాను: మాజీ డీజీపీ

Former Bihar DGP Gupteshwar Pandey To Join JDU Ahead Assembly Election - Sakshi

జేడీయూలోకి మాజీ డీజీపీ.. నేడే చేరిక!

మరోసారి ట్విస్టు ఇచ్చిన గుప్తేశ్వర్‌ పాండే

పట్నా: అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్న వేళ బిహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని అధికార జేడీయూలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన గుప్తేశ్వర్‌ పాండే ఇటీవలే స్వచ్చంద పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ప్రవేశించేందుకే ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వెలువడగా.. తొలుత వాటిని ఖండించిన గుప్తేశ్వర్‌ పాండే తాజాగా అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.(చదవండి: సమస్యలు లేకపోతే.. ముంబై నుంచి పార్శిల్‌ చేస్తాం)

ట్విస్టు ఇచ్చిన గుప్తేశ్వర్‌ పాండే..
కాగా సీఎంతో భేటీ అనంతరం గుప్తేశ్వర్‌ పాండే మాట్లాడుతూ.. ‘‘డీజీపీగా బాధ్యతలు నిర్వహించే క్రమంలో నాకు పూర్తి స్వేచ్చనిచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపేందుకే ఆయనను కలిశాను. ఎన్నికల్లో పోటీ చేసే విషయంమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అంటూ మరోసారి ట్విస్టు ఇచ్చారు. కాగా సీఎం నితీశ్‌ కుమార్‌కు మద్దతుగా గళం వినిపించే గుప్తేశ్వర్‌ పాండే, సుశాంత్‌ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నతాధికారిగా పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ‘‘నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని, ఇప్పుడు  నేనేమైనా చేయవచ్చు’’ అంటూ ఉద్యోగం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా ఎన్నికల సంఘం శుక్రవారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 28న తొలి విడత, నవంబర్‌ 3న రెండో విడత, నవంబర్‌ 7న మూడో విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top