మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్‌నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్‌బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్‌టౌన్‌లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్‌మెన్‌లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు.
పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు.
అయితే రాయల్‌గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్‌నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్‌షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..!
Comments
Please login to add a commentAdd a comment