‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’ | Ysrcp Leader Pulipati Durga Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’

Mar 18 2026 8:52 PM | Updated on Mar 18 2026 8:58 PM

Ysrcp Leader Pulipati Durga Reddy Fires On Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.

చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్‌ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్‌మీట్‌లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

ప్రచార ఆర్భాటంతో సరి:
కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.

అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్‌ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

2016 నాటి చట్టం అమలు చేయాలి:
ఇప్పటికే మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్‌ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ  కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది.  

దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:
చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్‌ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌లు అందజేసేవారు.

కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్‌లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.

డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్‌ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్‌ సైకిళ్లు, హియరింగ్‌ యంత్రాలు, బ్లైండ్‌ పర్సన్స్‌ కి స్టిక్స్‌ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.

దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్‌షిప్స్‌ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్‌ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు?:
వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్‌ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్‌ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం  జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement