durga reddy
-
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఖాకీ వనంలో.. కళాపుష్పం
కవిగా, రచయితగా, నటుడిగా రాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆడ పిల్లల అమ్మకాలు, వివిధ నేరాలపై ప్రదర్శనలు పలు అంశాల్లో అవార్డుల కైవసం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డునందుకున్న దుర్గారెడ్డి చందంపేట : ఆయన చేస్తున్నది పోలీస్ ఉద్యోగం. నిత్యం ఏదో ఒక కేసులో బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా రంగ స్థల ప్రదర్శనలపై దృష్టి సారిస్తున్నారు. లాఠీలతోనో, తూటాలతోనే ప్రజలను మార్చలేమని భావించి కళారూపాల ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చని నమ్మారు. అందుకే సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చి అధికారుల, రాజకీయ నాయకుల మెప్పు పొందారు. ఆయనే చందంపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మిర్యాల దుర్గారెడ్డి. దుర్గారెడ్డిది తిప్పర్తి మండలంలోని ఇందుగుల గ్రామం. ఆయన తల్లిదంద్రులు మిర్యాల వెంకట్‌రెడ్డి, లలిత. ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన దుర్గారెడ్డి చిన్ననాటి నుంచి ఆటల్లో మేటి. అలాగే హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే కవితలు, పాటలు రాయడం ఆరంభించారు. తనతల్లిదండ్రులనుంచి పుణికిపుచ్చుకున్న కళానైపుణ్యంతో అన్ని రంగాలలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. దుర్గారెడ్డి 1989లో పోలీస్‌శాఖలో చేరారు. నల్లగొండ పోలీస్‌శాఖలో స్థాపించిన ‘జాగృతి’ కళాబృందానికి ఇన్చార్జ్గా పని చేసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పచ్చదనం- పరిశుభ్రత, నిరక్షరాస్యత, ధూమపానం, గుట్కా నమలడం, మూఢనమ్మకాలు, నక్సలిజం, వరకట్న నిషేధం, ఇలా ఎన్నో దురాచారాల పట్ల అనేక రూపకాలు, పాటలు రూపొందించి తద్వారా జన చైతన్యానికి తన వంతు బాధ్యత వహించారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినాయాన్ని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. పోలీస్‌శాఖలో డీఐజీ ద్వారకా తిరుమలారావు, విశ్రాంత డీజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, అప్పటి నల్లగొండ ఎస్పీలు శివధర్‌రెడ్డి, సజ్జన్నార్, బాలసుబ్రహ్మణ్యంలు దుర్గారెడ్డి రచనలను అభినందించి ప్రోత్సహించారు. తన రచనలకు స్పందించిన స్నేహ ఆర్ట్స్ దేవరకొండ వారు 1992లో అక్కడి గ్రంథాలయంలో సన్మానించా రు. 1994లో నల్లగొండ పట్టణంలో జరిగిన కవి సమ్మేళనంలో మహిళల సమస్యలపై చదివిన తన కవితకు ప్రశంసలు అందుకున్నారు. 2001లో సూర్యాపేటలో, 2003లో సాహితీమేఖల ఆధ్వర్యంలో ఘన సత్కారాలు పొందారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం చేసిన సేవలను పాటల రూపంలో అందించి ప్రశంసలను అందుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో దుర్గారెడ్డి పాటలకు అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రశంసించారు. అవార్డులు 2007లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన కార్యక్రమంలో యమధర్మనాటికలో ఎస్ఐ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చింతల స్వచ్ఛంద సంస్థ తెలంగాణ ఉత్తమ రంగ స్థల నటుడు అవార్డుకు దుర్గారెడ్డిని ఎంపిక చేసి ప్రముఖ సినీగేయరచయిత సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ చేతుల మీదుగా ఉత్తమ వ్యాసరచన పోటీలో పోలీసులకు, ప్రజల మధ్య సత్సంబంధాలపై వ్యాసం రాసి ఉత్తమ అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2న చందంపేట ఎంపీడీఓ కె. నర్సింహులు, తహసీల్దార్ కత్తుల ఏలేశం చేతుల మీదుగా ఉత్తమ ఆర్టిస్ట్‌గా అవార్డుతో పాటు 10వేల రూపాయల నగదును బహుమతిని అందుకున్నారు. వైఎస్సార్‌పై పాటల పుస్తకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాసిన పాటలతో ఓ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని గత నెల 11న తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వచ్చిన దివంగత నేత వైఎస్సార్ తనయ షర్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డిని షర్మిల అభినందించారు. త్వరలోనే ఆడపిల్లల అమ్మకాలపై, తెలంగాణకు హరితహారంపై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు. ఇలా పోలీస్‌శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే కళారంగంలో రాణిస్తున్న దుర్గారెడ్డి పలువురికి ఆదర్శప్రాయంగాా నిలుస్తున్నారు. -
హోంమంత్రి దృష్టికి పోలీసుల సమస్యలు
సంగారెడ్డి క్రైం : పోలీసుల సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి శనివారం హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. అదనపు హెచ్ఆర్ఏ, రిస్క్ అలవెన్సు, యూనిఫాం అలవెన్సు, టీఏ తదితర సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని దుర్గారెడ్డి శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి ఆసీఫ్, సభ్యుడు నారాయణలు ఉన్నట్లు దుర్గారెడ్డి తెలిపారు.


