
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు.
..డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.
కట్టుకథలతో కేసులో ఇరికించారు..
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు.
