నిత్యాన్నదాన పథకానికి రూ.1.02 లక్షల విరాళం
మోపిదేవి: మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు వాస్తవ్యులు చెన్నంశెట్టి వెంకటేశ్వరావు రూ. 1,02,555 విరాళంగా అందజేశారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందచేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాల స్వామి వారి ముఖ మండపంలో శనివారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు భక్తులకు మాల వేసి దీక్షలు ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల సేవ ట్రస్ట్ చైర్మన్ తోట శ్రీనివాసరావు సుమారు 250 మంది భక్తులకు ఉచితంగా భక్తులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వీరేంద్ర, రాఘవేంద్ర, భక్త బృందం ప్రతినిధులు కృష్ణ, రుద్రువినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నగరంపాలెం: గుంటూరు నగరంలోని జిల్లా జైలును శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు సందర్శించారు. జైలు పరిపాలన, భద్రత చర్యలు, ఖైదీలకు సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్య ప్రమాణాలు, జైల్లో కుల వివక్షకు సంబంధించి అంశాలపై సమీక్ష చేపట్టారు. జైలు బ్యారక్స్, వంటశాల, ఆసుపత్రి విభాగం, బేకరీ యూనిట్, సందర్శకుల గది, ఇతర విభాగాలను పరిశీలించారు. ఖైదీలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్‌లు మాట్లాడారు. వారి అభిప్రాయాలు, అభ్యర్థనలు, సూచనలు నమోదు చేసుకున్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.కాంతరాజ్ తదితరులు ఉన్నారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల బ్యాంక్ కెనాల్ 146, తూర్పు కాలువకు 265, పశ్చిమ కాలువకు 115, నిజాంపట్నం కాలువకు 20, కొమ్మూరు కాలువకు 1,231 క్యూసెక్కులు విడుదల చేశారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.1.02 లక్షల విరాళం


