జెడ్పీలో టీడీపీ నేత మంతనాలు
స్థాయీ సంఘ అజెండా ఆమోదానికి వైసీపీ సభ్యులపై ఒత్తిడి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ రాజకీయాలకు వేదికగా మారింది. ప్రభుత్వ పాలకవర్గంలో భాగస్వాములైన జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అధికారులకు సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కావాల్సిన జెడ్పీ కార్యాలయంలో టీడీపీ నేత హల్‌చల్ చేశారు. చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షతీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఇటీవల స్థాయీ సంఘ సమావేశాన్ని బహిష్కరించడంతో శనివారం మరలా ఒకటో స్థాయీ సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక–ఆర్థిక అంశాలపై సదరు స్థాయీ సంఘ ఆమోదం పొందిన తరువాతే, సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండటంతో స్థాయీ సంఘ సభ్యుల అంగీకారం కీలకంగా మారింది. దీంతో శనివారం ఉదయం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జాన్‌సైదా ఒకటో స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు కాట్రగడ్డ మస్తాన్‌రావు, పదముత్తం చిట్టిబాబు, పిట్ల వేణుగోపాల్‌రెడ్డి, తుమ్మా విజయప్రతాప్‌రెడ్డితో స్టేషనరీ రూమ్‌లో మాట్లాడారు. అజెండా అమోదానికి సహకరించాలని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమ అంగీకారం లేకుండా ప్రవేశపెట్టిన అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని జెడ్పీటీసీ సభ్యులు తేల్చి చెప్పారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ చాంబర్‌కు వెళ్లిన జాన్‌సైదా అక్కడ కొద్దిసేపు ఉన్నారు. సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సభ్యులు ఈడ్పుగంటి కరుణకుమారి, జంగా వెంకట కోటయ్య, కందుల సిద్దయ్య పాల్గొన్నారు.


