
మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.
సాక్షి తాడేపల్లి: మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ హయాంలో రిసోర్స్ ఫండ్ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘‘వైఎస్ జగన్ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ఆపలేదు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో జీడీపీ వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీ 4.83 శాతానికి వృద్ధి చెందింది.ఆనాడు చంద్రబాబు దాదాపు రూ.41 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ కట్టారు.’’ అని కన్నబాబు వివరించారు.
చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. ప్రజల మెదళ్లోకి విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తే తన సొంత పనుల కోసం వెళ్లినట్టు అంట. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కోసమట. చంద్రబాబుకు అధిష్టానం ఢిల్లీలో ఉంది. అందుకే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. విభజన చట్టం ప్రకారం రూ.17 వేల కోట్లు ఏపీకి రావాలి. కానీ చంద్రబాబు తెచ్చింది రూ.3,900 వేల కోట్లు మాత్రమే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.10,500 వేల కోట్లు నిధులు తెచ్చారు. మరి చంద్రబాబు గొప్పా? వైఎస్ జగన్ గొప్పా?. కరోనాని సమర్థవంతంగా జగన్ ఎదుర్కొన్నారు
..ప్రజలకు సంక్షేమ పథకాలను ఆపకుండా అందించారు. జీడీపీలో మన రాష్ట్ర షేర్ 4.47 నుంచి 4.83కు పెరిగింది. మెరుగైన ఫలితాలు వైఎస్ జగన్ సాధించగలిగారు. చంద్రబాబు రూ.42,183 వేల కోట్ల బకాయి పెట్టి పోతే జగన్ ఆ అప్పులన్నీ తీర్చారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కూడా జగన్ పర్యవేక్షణ చేశారు. రక్తహీనత రాకుండా చూసేందుకు మంచి భోజనం పెట్టారు. చంద్రబాబు అంతకుమించి పెడితే సంతోషిస్తాం. ఎఫ్.ఆర్.బీఎం. లిమిట్స్ దాటి అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆయన చేసిన ఆ అధిక అప్పులను కూడా జగన్ చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఒక బ్రహ్మపదార్థం. రూ. 14 లక్షల కోట్లు మా హయాంలో అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు.

..బడ్జెట్‌లో రూ.6 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చంద్రబాబు చెప్తున్నారు. అంటే అసెంబ్లీలో చెప్పిన రూ.6 లక్షల కోట్ల అప్పుల మాట అబద్ధమా?. ఈ ఐదు నెలల కాలంలో చంద్రబాబు రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ సొమ్ముతో ఏ ఒక్క సంక్షేమ పథకాన్నైనా ఎందుకు అమలు చేయలేదు?. ఆ నిధులన్నీ ఏం చేశారు?. 2014-19 మధ్యలో రైతురుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు. రూ.83 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా రూ.13 వేల కోట్లు విదిల్చారు. చంద్రబాబు ఏం చేయకుండా చేసినట్టు గొప్పగా చెప్పుకుంటారు. మేము ఎన్నో చేసినా చెప్పుకోలేకపోయాం
..సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి వారి ఎఫ్ఐఆర్‌లను ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టటం లేదు?. ఈ ఐదు నెలల్లోనే చంద్రబాబు అనేక జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచారు?. విజయమ్మ రాసిన లేఖను సైతం ఫేక్ లెటర్ అంటూ టీడీపీ అధికార ట్విట్టర్‌లో పెట్టారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి. వారు నిజాయితీగా ఉంటే వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయాలి. గోదావరి జిల్లాలో రూ.6 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.16 వేలకు చేరింది. పోలవరం ఎత్తు తగ్గించటానికి కారణ ఏంటో ప్రజలకు చెప్పాలి. ఆ ప్రాజెక్టును బ్యారేజీలాగా మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. పోలవరం అనగానే గుర్తొచ్చేది వైఎస్సార్. ఆయన లెగసీని జగన్ కంటిన్యూ చేశారు.
..చంద్రబాబు తెచ్చిన లిక్కర్‌ను చూసి మందుబాబులు తిడుతున్నారు. రూ.99 లకు ఇస్తున్న లిక్కర్ ఇతర రాష్ట్రాల్లో రూ.80లకే దొరుకుతుంది. వైన్ షాపులు తీసుకున్నవారు సైతం ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మోసం చేయని వర్గం అంటూ ఏమీ లేదు. కక్షసాధింపునకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారిపోయింది. శాంతిభద్రతలు ఫెయిల్ అయ్యాయని కూటమి పెద్దలే అంటున్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా ఇలాగే అక్రమ కేసులు పెట్టారు. మహిళలను సైతం వేధింపులకు గురి చేశారు. జగన్ వచ్చాకే ఆ కేసులను రద్దు చేశారు. వైఎస్ జగన్‌పై నీచంగా పోస్టులు పెడితే పోలీసులకు కనపడటం లేదా?. ఎన్ని పన్నాగాలు వేసినా, ఎత్తుగడలు వేసినా ఫలించవు. ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేయలేరు. ఈ డైవర్షన్ రాజకీయాలు మానేసి ప్రజలకు మేలు చేయాలి’’ అని కన్నబాబు డిమాండ్ చేశారు.