
సాక్షి, విజయవాడ: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి సంవత్సర కాలంలోనే 15వేల కోట్లు భారం వేశారని.. 200 కరెంటు బిల్లు వచ్చిన వాళ్లకు బిల్లు మోత మోగిస్తున్నాయని దేవినేని అవినాష్ మండిపడ్డారు.
‘‘కరెంట్ చార్జీలు తగ్గించపోగా భారీగా పెంచారు. పెరిగిన కరెంట్ ఛార్జీలత్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు. జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బాగా నడిచిందని ప్రజలు అంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచం అని కూటమి నేతలు బాండ్లు ఇచ్చి ఓట్లు అడిగారు. నాడు బాండ్లు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో తిరగగలరా?. సంక్షేమం, అభివృద్ధి చేయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎస్సి, ఎస్టీలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ని కూడా తొలగించారు’’ అని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు.
అధికారులు.. ప్రతిపక్ష పార్టీల నేతలు అర్జీలు ఇస్తామన్న తీసుకోవడానికి భయపడుతున్నారు.. మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్‌సీపీ నేతలను చూస్తే అధికారులకు భయం వేస్తోంది. ప్రజలను అన్యాయం చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకొంటాం. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఎస్సీ. ఎస్టీలకు ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటం చేస్తాం. వర్షాల్లో దెబ్బ తిన్న రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.