Maharashtra: మెజారిటీ నిరూపించుకోమనండి.. మహారాష్ట్ర సంక్షోభంలో కీలక మలుపు

Devendra Fadnavis Requested Governor Ask MVA Govt Prove Its Majority - Sakshi

సభలో మెజారిటీ నిరూపించు కొమ్మని సీఎంను ఆదేశించండి 

గవర్నర్‌కు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ విజ్ఞప్తి

ముంబై/న్యూఢిల్లీ/గువాహటి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మంగళవారం కీలక మలుపు తిరిగింది. వారానికి పైగా వేచిచూసే ధోరణి అవలంబించిన బీజేపీ నేరుగా రంగంలోకి దిగింది. విపక్ష నేత, బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం రాత్రి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని కలిశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘శివసేనపై 39 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేసి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పాలక మహా వికాస్‌ అఘాడీ కూటమి మైనారిటీలో పడింది. అందుకే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించాం’’ అని వివరించారు. అంతకుముందు మంగళవారం రోజంతా బీజేపీ శిబిరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్‌ ఉదయమే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తదితరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ వ్యూహంపైనే వారు చర్చించినట్టు చెబుతున్నారు.

రాత్రికి ముంబై తిరిగి రాగానే పదింటికి ఫడ్నవీస్‌ నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మరోవైపు షిండే శిబిరంలో చేరిన 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్‌ను మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఈ మెయిల్‌ ద్వారా కోరినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై రానున్నట్టు శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. వస్తే అన్ని విషయాలూ చర్చించుకుందామంటూ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా రెబల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘రెబల్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తిరిగొచ్చి నాతో మాట్లాడితే సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం క్రమంగా క్రైమాక్స్‌కు చేరుతున్నట్టు కన్పిస్తోంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబై తిరిగొచ్చి బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరతారన్న వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. 

దమ్ముంటే పేర్లు చెప్పండి: షిండే 
20 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారన్న శివసేన వ్యాఖ్యలను షిండే కొట్టిపారేశారు. దమ్ముంటే వారి పేర్లు చెప్పాలని సవాలు చేశారు. ఉద్ధవ్‌పై ఆయన తిరుగుబావుటా ఎగరేయడం, తన వర్గం ఎమ్మెల్యేలతో వారం రోజులుగా అసోంలోని గువాహటిలో ఓ స్టార్‌ హోటల్లో మకాం వేయడం తెలిసిందే. శిబిరంలో ఇప్పటికే 39 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మందికి పైగా స్వతంత్రులున్నారు. 19 మంది శివసేన లోక్‌సభ సభ్యుల్లో కూడా ఏకంగా 14 నుంచి 16 మంది షిండే వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో కనీసం 12 మంది ఇప్పటికే శిబిరంలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హోటల్‌ బయట షిండే విలేకరులతో మాట్లాడారు. తన వర్గం ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై వస్తానని ప్రకటించారు. బాల్‌ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారంతా స్వచ్ఛందంగా తనతో కలిసొచ్చారని పునరుద్ఘాటించారు. 

బీజేపీ దూకుడు 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలకు బీజేపీ పదును పెంచింది. అధికార సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభంతో తమకు ఏ సంబంధమూ లేదని పార్టీ అంటున్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా అమిత్‌ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ, సీనియర్‌ లాయర్‌ మహేశ్‌ జఠ్మలానీ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది! సేన రెబల్స్, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. అనంతరం ఫడ్నవీస్‌ నడ్డా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇదీ నంబర్‌ గేమ్‌
సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) 
మెజారిటీ మార్కు: 144 
షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది 
పాలక కూటమి వాస్తవ బలం: 168 
షిండే తిరుగుబాటు తర్వాత: 119 
బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 
షిండే కూటమి మద్దతిస్తే: 162

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top