రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే

Published Mon, Feb 26 2024 5:29 AM

Congress President Kharge claims efforts on to change constitution - Sakshi

బెంగళూరు: దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి, గట్టిగా ఎదుర్కోలేకపోతే దేశంలో నియంతృత్వపాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో గట్టిగా, ఐక్యంగా నిలబడకుంటే, దేశంలో నియంతృత్వం రావడం ఖాయం. నియంతృత్వం కావాలనుకుంటున్నారా లేక న్యాయంతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజ్యాంగం మనుగడ సాధించిన పక్షంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించగలుగుతారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు’అని ఖర్గే వ్యాఖ్యానించారు.

అందుకే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దానికి కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఒక భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని వదులుకుని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలను ఎందుకు పడగొడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో నియంతృత్వం రావచ్చని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీయే కనీసం బీజేపీ ప్రభుత్వ గ్యారెంటీయే అని చెప్పకుండా మోదీ తన గ్యారెంటీ అని చెప్పుకోవడం ఏమిటన్నారు. ‘అది నీ గ్యారెంటీ ఎలా అవుతుంది? అది నీది కాదు. ప్రజలు డబ్బుతో అమలు చేసే గ్యారెంటీ’’ అన్నారు.

 
Advertisement
 
Advertisement