ఏపీలో ఎలా ముందుకెళ్దాం? | Sakshi
Sakshi News home page

AP Congress: ఏపీలో ఎలా ముందుకెళ్దాం?.. ఉనికినైనా కాపాడుకుందాం!

Published Wed, Dec 27 2023 10:44 AM

Congress Party High Command Focus On Andhra Pradesh - Sakshi

ఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ, పలువురు ఏఐసీసీ నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఏపీ పీసీపీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఈ సమావేశానికి హాజరై.. హైకమాండ్‌కు పార్టీ పరిస్థితిని నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుని పోయింది. గత ఎన్నికల సమయంలో అయితే ఏకంగా ఓటు బ్యాంక్‌ లేని పార్టీగా మిగిలింది. ప్రస్తుతం హస్తానికి చెప్పుకోదగ్గ నాయకుల్లేరు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. అలా.. ఉనికి కోల్పోయిన పార్టీకి తిరిగి గుర్తింపు తెచ్చే ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నాయి.

ఎలా వెళ్దాం.. 
దక్షిణ రాష్ట్రాల్లో.. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అందుకు అక్కడి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన కారణం అనే సంగతి తెలిసిందే.  కానీ, ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో.. కనీసం నామ మాత్రపు ఓటు బ్యాంకుతో అయినా ఉనికిని కాపాడుకోవాలన్నదే కాంగ్రెస్‌ యత్నంగా కనిపిస్తోంది.  

చర్చల్లో ప్రధానంగా..
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందో.. పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్‌ పార్టీకి ఒక రిపోర్ట్‌ ఇవ్వనున్నారు. దానిని క్షుణ్ణంగా పరిశీలించాకే హైకమాండ్‌ .. మేనిఫెస్టో రూపకల్ప, పార్టీలతో పొత్తులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. అయితే..

పార్టీలో చేరికలు, పొత్తులపై  ఇవాళ్టి భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యక్ష మద్ధతు ప్రకటించింది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ. ఆ పార్టీని విలీనం చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని ఏపీ పీసీసీ చీఫ్‌ ఖండించపోవడంతో ఆసక్తి నెలకొనగా.. నేటి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. పొత్తులపైనా మరో వారం, పదిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement
Advertisement