
సీఎం రేవంత్‌ను పాలమూరు సభకు ఆహ్వానిస్తున్న వంశీచంద్‌రెడ్డి తదితరులు
6న మహబూబ్‌నగర్‌లో ‘ప్రజాదీవెన సభ’
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారా వాన్ని పూరించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ఇలాకా అయిన పాలమూరు వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నా రు. ఈ మేరకు ఈ నెల 6న మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ‘పాలమూరు ప్రజాదీవెన’పేరిట భారీ బహిరంగ సభకు కసరత్తు చేపట్టారు.
ఈ సభకు ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు సహచర మంత్రులు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్ని కల్లో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 12 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లోనూ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు లక్ష మంది జనసమీకరణకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘పాలమూరు’అస్త్రంగా..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటైనా గెలవాలని సీఎం రేవంత్ ఇటీవల సవాల్ విసిరిన విషయం విదితమే. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు పియర్లు కుంగిపోవడంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముఖ్యనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలో మేడిగడ్డ పేరిట కాళేశ్వరం బాట పట్టగా అదే రోజు పోటీగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం చేసి పాలమూరు ప్రజలను అన్యాయానికి గురిచేసిందని ఆరోపించారు. అలాగే పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌కు నివేదిక అందజేశారు. దీన్నిబట్టి ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టునే ప్రధాన అస్త్రంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో చేపట్టిన ‘పాలమూరు న్యాయయాత్ర’ఈ నెల 6న ముగియనున్న నేపథ్యంలో పాలమూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకావాలని వంశీచంద్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌ను కలసి ఆహ్వానించారు.