ఇడ్లీ పాత్ర.. దోసె పెనం..కుతకుతలాడే అన్నం! | Congress leaders answer to Brs questions | Sakshi
Sakshi News home page

ఇడ్లీ పాత్ర.. దోసె పెనం..కుతకుతలాడే అన్నం!

Published Fri, Nov 10 2023 2:53 AM | Last Updated on Thu, Nov 23 2023 11:29 AM

Congress leaders answer to Brs questions - Sakshi

‘‘మీ పార్టీ లో అందరూ సీఎమ్ము క్యాండిడేట్లే. నామినేషన్‌ వేసే ప్రతివాడూ నేనూ సీఎమ్మంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. జనాలు నవ్వుకుంటుంటే మీకు సిగ్గేయడం లేదా?’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలూ, కార్యకర్తలందరూ విమర్శించసాగారు.  

పై ప్రశ్నకు ఇలా బదులు చెప్పారు కాంగ్రెస్‌ నేతలు.  
‘‘తిండి అంటే అందరికీ ఇష్టం. కాబట్టి మీ ప్రశ్నకు వంట ఐటమ్స్‌తోనే జవాబు చెబుతాం వినండి.  కాంగ్రెస్‌ అనేది ఇడ్లీ పాత్రలాంటిది. అందులో బోల్డన్ని ఇడ్లీప్లేట్లు ఉంటాయి. కింది నుంచి పైకి వేర్వేరు అంతస్తుల్లో అంచెలవారీగా కనిపిస్తుంటాయిగానీ..ఇడ్లీలన్నీ సమానంగా ఉడుకుతాయి. మా నాయకులూ అంతే. ఒకేసారి వాయి దిగే ఇడ్లీల్లాంటివారే. ఎందరో ఇడ్లీలు..అందరూ సీఎమ్ములే’’   

‘‘మరి మా బీఆర్‌ఎస్‌ వాళ్లో?’’  
‘‘బీఆర్‌ఎస్‌ సీఎంని దోసెపెనంతో పోల్చవచ్చు. ఇక్కడ దోసెపెనం ఎగ్జాంపుల్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది..ఇంటి దోసెపెనం. ఈ ఎగ్జాంపుల్‌ను  తీసుకుంటే ఇక్కడ ఒకేఒక్క దోసెకు అవకాశముంటుంది. అది మీ పార్టీ అధినేత. అంటే... ఆయనొక్కడే సీఎం అన్నమాట. ఇక.. ‘ఏ హోటల్లోనో లేదా టిఫిన్‌ సెంటర్‌లోనో ఒకేసారి నాలుగు దోసెలేసే వెడల్పాటి పెనాలుంటాయి కదా’ అని మీరడగొచ్చు. అక్కడికే వస్తున్నాం. టిఫిన్‌సెంటర్లోలాంటి ఆ పెనమ్మీద ఒకేసారి వేయగలిగే నాలుగు దోసెల్లాంటి బీఆర్‌ఎస్‌లోని ఇంపార్టెంట్‌ నేతలెవరో మీకు వేరే చెప్పక్కర్లేదనకుంటా!’’  

‘‘మరి కమ్యూనిస్టులో?’’ 
‘‘ఒకప్పుడు వాళ్లు కూడా అన్నోఇన్నో సీట్లు గెలిచి పచ్చడిజాడీల్లా ఉండేవారు. ఇక్కడ పచ్చడి జాడీ అని ఎందుకంటున్నామంటే... అది మామిడికాయ పచ్చడైనా, పండుమిరపకాయ కొరివికారమైనా..ఇలా దాదాపు పచ్చళ్లేవైనా..‘ఎర్ర’టి ఎరుపురంగులో మిలమిలలాడుతూ కమ్యూనిస్టు కళతో కళకళల్లాడేవి. కానీ ఇప్పుడో?  ఇటు పొత్తులపరంగా చూసినా..లేదా అటు గెలుపుపరంగా చూసినా వాళ్లకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.

కాబట్టి..ప్రస్తుతానికి వాళ్లను దంపుడుకారం మిల్లులోని గుంటల్లో మిరపకాయలనుకోవచ్చు. ఎర్రటి ఎండు మిరపల్ని అందులో వేయగానే..రోకళ్లు రెండూ ఒకదాని తర్వాత మరొకటి ఆల్టర్నేట్‌గా దెబ్బేస్తుంటాయి. ఆ రోకళ్లు మరెవరో కాదు..మొదట బీఆర్‌ ఎస్, తర్వాత కాంగ్రెస్‌! దాంతో పాపం..ఆ ఎండు మిరపలన్నీ పొడి పొడి అయిపోయి, కారంగా మా రి,  ఘాటెక్కి, మంటెక్కి భగభగలాడుతున్నారు’’  

‘‘సరే... మరి పువ్వు పార్టీ వాళ్లో?’’  
‘‘వాళ్లు కాషాయం పార్టీ వాళ్లు కదా..అందుకే కషాయం అనుకోవచ్చు. అది ఆరోగ్యానికి మంచిదంటారు కదా. అచ్చం అలాగే కాషాయం దేశానికి మంచిదని వాళ్లూ అనుకుంటుంటారు’’  

‘‘సరే మరి ఓటర్లో?’’  
‘‘ఓటర్లనేవాళ్లు బియ్యపుగింజల్లా బోలెడంత మంది ఉంటారు. వ్యవహారికంలో కష్టాలొచ్చినప్పుడు ‘ఎసరొచ్చింది’ అనే నానుడి వాడుతుంటాం కదా. అలా ఎప్పుడూ వాళ్లకే ఎసరొస్తూ ఉంటుంది. ఎసరు మరగ్గానే పోసిన బియ్యపు గింజల్లా..పాపం  వాళ్లెప్పుడూ కుతకుతలాడిపోతూ, ఉడికిపోతూ ఉంటారు.

కానీ..ఎన్ని వంటకాలున్నా, ఎన్ని కూరలున్నా, ఎన్ని పచ్చళ్లున్నా అన్నమే మెయిన్‌ కదా. అలా చూస్తే..ఓటర్లు అన్నం లాంటివాళ్లన్నమాట. కాకపోతే ఎలక్షన్‌ టైములో అప్పుడే ఉడికిన వేడివేడి అన్నంలాంటి వాళ్లు. ఇక ఎన్నికలై ఏడాదిగానీ గడిచిందా.. పాశిపోయి పారేయాల్సిన సద్దిబువ్వల్లాంటివాళ్లవుతారు. ప్చ్‌..పాపం. ఇలా ఏరకంగా చూసినా వాళ్లు...  
 
‘అన్నమో రామచంద్రా’ అంటూ ఆల్వేస్‌ మొత్తుకుంటూ ఉండే అన్నం మెతుకులన్నమాట.’’    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement