
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్‌లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.
కేసీఆర్‌తోనే ఉనికి..
కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.
బీజేపీకి ప్లస్ అవుతోంది..
తండ్రి కూతురుగా కవిత లీడర్‌గా ఎదిగారు. కేసీఆర్‌ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్‌లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు.

కవితకు అవగాహన లేదు..
బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు.