సోనియానే మా లీడర్‌: గులాం నబీ ఆజాద్‌ | Sakshi
Sakshi News home page

సోనియానే మా లీడర్‌.. ఇక కలిసికట్టుగా ముందుకెళ్తాం: గులాం నబీ ఆజాద్‌

Published Fri, Mar 18 2022 7:41 PM

Congress Crisis: No Question On Sonia Leadership Says Ghulam Nabi Azad - Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా పార్టీ క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్లు.. మళ్లీ అధిష్టానానికి దగ్గరవుతున్నారు. శుక్రవారం సాయంత్ర జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం.

జీ-23గా పిల్చుకుంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ రెబల్స్‌ నేతలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల చేదు ఫలితాలపై గరం గరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై వరుస భేటీలతో హీట్‌ పెంచిన సీనియర్లు ఎట్టకేలకు చల్లబడ్డారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌.. అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం 10, జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి కలిశారు. 

భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీతో భేటీ సంతృప్తికరంగా సాగిందని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల  ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నామని’’ ఆజాద్‌ వెల్లడించారు.   

ఇదిలా ఉండగా.. బుధ, గురువారాల్లో ఆజాద్‌ నివాసంలో కాంగ్రెస్‌ రెబల్స్‌ జీ-23 భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అందరినీ కలుపుకుని పోవాలని, భావసారుప్యత ఉన్న పార్టీలతో చర్చించాలని హైకమాండ్‌కు సీనియర్లు సూచించినట్లు సమాచారం.  మరోవైపు గాంధీలు తప్పుకోవాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి.

Advertisement
Advertisement