Sakshi News home page

ఆ లోక్‌సభ సెగ్మెంట్‌లలో మిశ్రమ ఫలితాలు

Published Tue, Dec 5 2023 1:55 AM

Congress and BRS and BJP seats in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ సెగ్మెంట్‌ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌కు నాలుగు లోక్‌సభ సెగ్మెంట్‌లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్‌సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్‌లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది.

బీఆర్‌ఎస్‌ 
నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే  
39 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సెగ్మెంట్‌ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్‌లో బీజేపీ గెలిచింది.

ఇక పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని స్టేషన్‌ ఘన్‌పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్‌లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకోవడం గమనార్హం.  

కాంగ్రెస్‌
రాజధానిలో హస్తవాసి బాగాలేదు  
ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది.

కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్‌లో మాత్రమే 
కాంగ్రెస్‌ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్‌ఎస్‌ విజయ కేతనం ఎగురవేసింది.  

బీజేపీ
నలుగురు ఎంపీలున్నా నిరాశే  
బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్‌సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్‌ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్‌ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు.

మరో ఎంపీ సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. సంజయ్‌ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌లలో బీఆర్‌ఎస్‌ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్‌ అర్బన్‌లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది.

సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించింది.

Advertisement
Advertisement