పదహారుపై గురి | Congress activity begins for Lok Sabha elections | Sakshi
Sakshi News home page

పదహారుపై గురి

Dec 13 2023 4:30 AM | Updated on Dec 13 2023 8:51 AM

Congress activity begins for Lok Sabha elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న మూడు నెల­ల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదపడం ప్రారంభించింది.

ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరిద్దరికి మా­త్రమే పార్లమెంటుకు పోటీ చేసే అవకా­శం ఇవ్వాలని, మిగిలిన వారిని ఎట్టి పరిస్థితు­ల్లోనూ ప్రోత్సహించవద్దని కాంగ్రెస్‌ నాయ­క­త్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలే ధ్యే­యంగా బీఆర్‌ఎస్, బీజేపీల ము­ఖ్యనేతలను పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దింపే ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.  

10–12 చోట్ల క్లియర్‌ 
ఎంపీ సీట్లకు టికెట్ల ఖరారు వ్యవహారం 10–12 స్థానాల్లో సులభమేనని గాం«దీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణ పరిధిలోకి వచ్చే నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలతో పాటు పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీ­రాబాద్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేమీ కాదని అంటున్నాయి. ఈ స్థానాల నుంచి ఇప్పటికే రెండు చొప్పున పేర్లను పరిశీలిస్తున్నారనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

నల్లగొండ పార్లమెంటు నుంచి జానారెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డిలలో ఒకరు, భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలలో ఒకరు, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచందర్‌రెడ్డి, సీతా దయా­­కర్‌రెడ్డిలలో ఒకరు, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి లేదా పి.రాములు (కాంగ్రెస్‌లోకి వస్తే), చేవెళ్ల నుంచి కేఎల్‌ఆర్‌  లేదంటే బీఆర్‌ఎస్‌ నుంచి వస్తారని భావిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నేత, లేదంటే బీజేపీ నుంచి మరో కీలక నేత, మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంతరావులను బరిలోకి దింపే అంశంపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది.

ఇక పెద్దపల్లి నుంచి చెన్నూ­రు ఎమ్మెల్యే జి. వివేక్‌ కుమారుడు వంశీ లేదా పెరిక శ్యాం, ఖమ్మం నుంచి వి.హ­నుమంతరావు లేదంటే రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావుల్లో ఒకరు, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్, విజయాబాయి (వైరా)లలో ఒకరికి టికెట్‌ ఇ­వ్వొ­చ్చ­ని అంటున్నారు. వరంగల్‌ నుంచి సి­రిí­Ü­ల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య, అ­ద్దంకి­దయాకర్‌ (మంత్రి పదవి ఇవ్వకపో­తే) పే­ర్లను, మెదక్‌ నుంచి జగ్గారెడ్డి లేదా వి­జ­­య­శాంతి, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ షె­ట్కార్‌ పేర్లను పరిశీలించవచ్చని సమాచారం.  

ఆ ఐదు చోట్ల త్రిముఖ పోటీ! 
ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ నుంచి కూడా పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీలో నెట్టుకురావాల్సిన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమయిందని ఆ పార్టీ వర్గాలు చెపుతు­న్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకా­రం హైదరాబాద్‌ నుంచి అజారుద్దీన్‌ లేదా ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ లేదా నవీన్‌ యాదవ్, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి సంజయ్‌ లేదా టి.జీవన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ మనుమడు రోహిత్‌రావు, పాడి ఉదయానందరెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి నరేశ్‌ జాదవ్‌ లేదా మరో ఆదివాసీ నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారు.

మొత్తం మీద ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరిద్దరి పేర్లు మాత్రమే పార్లమెంటుకు పరిగణనలోకి తీసుకుంటామని, అసెంబ్లీ టికెట్ల విషయంలో త్యాగం చేసిన వారికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement