
సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు
ఎమ్మెల్సీల అనర్హతపై సోమవారం కేటీఆర్ పిటిషన్ దాఖలు
బనకచర్లపై సుప్రీం న్యాయవాదులతో హరీశ్ మంతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరంతరం విమర్శల వర్షం కురిపిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ.. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్ ‘గోదావరి బనకచర్ల’లింకు ప్రాజెక్టుపైనా దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపైనా కోర్టుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
ఢిల్లీకి చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు.
బనకచర్లపై బీఆర్‌ఎస్ న్యాయపోరాటం
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్.. ఈ ప్రతిపాదనకు ఆదిలోనే అడ్డు చెప్పాలని భావిస్తోంది. బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రకటించిన బీఆర్‌ఎస్ అందుకు అవసరమైన కార్యాచరణపైనా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. బనకచర్ల ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయంపై ఇప్పటికే పార్టీ కేడర్‌కు, విద్యార్థి, యువజన విభాగం నాయకులకు బీఆర్‌ఎస్ అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, మంచిర్యాలలో విద్యార్థి సదస్సులు కూడా నిర్వహించింది. ఓ వైపు క్షేత్ర స్థాయిలో బనకచర్లను అడ్డుకుంటూనే మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది.
బనకచర్లపై సుప్రీంకు వెళ్లే యోచన!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. నీటిపారుదల రంగానికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగిన మాజీమంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన హరీశ్‌రావు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. కాగా బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం