రేవంత్‌కు కేసీఆర్‌ ఫోబియా: కేటీఆర్‌ | BRS Leader KTR Comments on CM Revanth | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు కేసీఆర్‌ ఫోబియా: కేటీఆర్‌

Aug 8 2025 1:17 AM | Updated on Aug 8 2025 1:17 AM

BRS Leader KTR Comments on CM Revanth

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌ మోసం చేస్తోంది 

స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి ప్రణాళికలు వేస్తోంది 

పార్టీ పేరు చెప్పుకోలేని స్థితిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు  

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్‌ ఫోబియా పట్టుకుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్‌ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

సీఎం రేవంత్‌వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్‌.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. 

అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాందీతో సీఎం రేవంత్‌ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని రేవంత్‌ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.  

చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. 
‘బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. 

స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్‌ అన్నారు. 

కార్యకర్తలకు న్యాయం చేస్తాం 
‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి. 

కొందరు చెప్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement