
భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి
పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు.