క్రిస్మస్ ట్రీ దీపాలంకరణను స్విచ్చాన్ చేసి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, కాంగ్రెస్ నాయకుడు సంపత్‌కుమార్
విద్వేషపూరిత ప్రసంగాలపై త్వరలో అసెంబ్లీలో చట్టం
క్రిస్మస్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అన్ని మతాలకు సమానమైన హక్కు, అధికారం, స్వేచ్ఛ
రాష్ట్రంలో ఇప్పటికే ఎవరి మతాన్ని వాళ్లు ఆచరించుకునే వాతావరణం
మత ప్రాతిపదికన దాడులపై ఉక్కుపాదం
మైనారిటీలకు అందించే సంక్షేమం దయ కాదు.. అది వారి హక్కు అని స్పష్టి కరణ
ఊరికి కొంచెం దూరమైనా శ్మశానవాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయిస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుని శిక్షించడానికి వీలుగా త్వరలోనే శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఇతర మతాలను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాల్లో అలాంటి చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. అన్ని మతాలకు సమానమైన హక్కు, అధికారం, స్వేచ్ఛను అందిస్తామని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ను పురస్కరించుకుని క్రైస్తవులకు ఇచి్చన విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మరణించినప్పుడు కూడా ప్రభుత్వానిదే బాధ్యత
‘రాష్ట్రంలో ఇప్పటికే ఎవరి మతాన్ని వాళ్లు ఆచరించుకుంటూ ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని తీసుకొచ్చాం. మత ప్రాతిపదికన దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, ఘటనలకు పాల్పడినా కఠినంగా అణచివేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు అందించే సంక్షేమం, అభివృద్ధి ఎవరి దయ కాదు.. వాళ్ళ హక్కు. మైనారిటీల హక్కులను కాపాడటంతో పాటు భంగం వాటిల్లినా సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మైనారిటీలకు శ్మశానవాటికల సమస్య ఉంది. స్థల సమస్య కారణంగా ఊరికి కొంచెం దూరమైనా ప్రభుత్వ భూమిæ కేటాయిస్తాం. స్థానికంగా అంబులెన్సులను ఏర్పాటు చేసుకుని అక్కడికి తీసుకెళ్ళాలి. బతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు, మరణించినప్పుడు వాళ్ళను ఎక్కడికి తీసుకువెళ్ళాలనేది కూడా ప్రభుత్వ బాధ్యతే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
డిసెంబర్ అద్భుతమైన నెల
‘డిసెంబర్ క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదు..యావత్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ (అద్భుతమైన నెల). ఈ మాసంలో యేసు ప్రభువు జన్మించి ప్రపంచానికి శాంతి సందేశం అందించి అందరినీ సన్మార్గంలో నడిపించారు. ఈ నెలలోనే సోనియాగాంధీ తన జన్మదిన కానుకగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల బలమైన ఆకాంక్షను సాకారం చేశారు. అలాగే ఇదే మాసంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ సమాజానికి ఒక మిరాకిల్. ఈ రెండేళ్లలో ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా, ఆరోపణలు చేసినా, ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాం.
రాష్ట్రంలో ఈ రెండేళ్లలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం దాదాపుగా రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టింది. 65 లక్షల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఆడబిడ్డలకు రూ.27 వేల కోట్ల రుణాలు సున్నా వడ్డీతో అందించి ఆర్థికంగా ఆదుకుంది. రేషన్‌కార్డు కలిగిన ప్రతి పేదవాడికి ప్రతి నెలా ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా రూ.500 బోనస్ ఇస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని సీఎం వివరించారు.
తెలంగాణ నంబర్ 1గా ఉండేలా ప్రభువును ప్రారి్థంచాలి
‘క్రిస్టియన్ మిషనరీస్ ఒక యుద్ధం మాదిరిగా విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించడం ప్రశంసనీయం. ప్రభుత్వాలతో సమానంగా పేదలకు సేవలు అందించడం వల్లే నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికే మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఆనాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాడు మనిషి జీవన ప్రమాణం 32 సంవత్సరాలుంటే తాజాగా మిషనరీ సంస్థల సేవలతో సరాసరి 72కు పెరిగింది. ’తెలంగాణ రైజింగ్’ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. అలా ముందుకు వెళ్లేలా శక్తిని ప్రసాదించడానికి ప్రభువును ప్రారి్థంచాలి..’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.


