డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Slams DK Aruna KCR At Kodangal Meeting | Sakshi
Sakshi News home page

ఆమె మీద అసూయ, కోపం ఎందుకు ఉంటాయి?: సీఎం రేవంత్‌

Apr 23 2024 9:06 PM | Updated on Apr 23 2024 9:27 PM

Cm Revanth Reddy Slams DK Aruna KCR At Kodangal Meeting - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు.

‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. 

పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. 

వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం.  200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. 

సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్‌కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement