సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేసినట్టు తెలిపారు. ఇదే సమయంలో రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు. బీఆర్‌ఎస్ కారణంగా తెలంగాణ పూర్తిగా దివాలా తీసిందని ఘాటు విమర్శలు చేశారు.
తాజాగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. రూ.1300 కోట్ల బకాయిలు రద్దు చేసిన ఘటన వైఎస్సార్‌దే. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నేత వైఎస్సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలిచింది. రైతుల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్ట్‌లు నిర్మించింది. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేశాం.
వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి టాప్..
ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌గా మారాయి. వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చింది. బీఆర్‌ఎస్ పాలనలో సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్‌తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?. కాళేశ్వరంలో ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?. కాళేశ్వరం లేకున్నా దేశంలో అత్యధిక వరి దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరి ఉత్పత్తి లేదు. రూ.20లక్షల కోట్లతో నికరంగా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా?.
సంక్షేమం ఇదే కదా..
రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చకండి. అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. వందేళ్లు పూర్తి అయిన ఉస్మానియా ఆసుపత్రిని కూడా కట్టలేదు. తెలంగాణను పూర్తిగా దివాలా తీశారు. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. వాళ్లు దొడ్డు బియ్యం ఇస్తే, మేము సన్న బియ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా పెంచాం. షాద్ ముబారక్ కొనసాగించాం. రూ.500లకే సిలిండర్ ఇచ్చాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఆపలేదు. వాటిని కొనసాగిస్తున్నాం. ఎర్రగడ్డ, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తాం.
తెలంగాణలో అభివృద్ధి జరగవద్దా?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరగాలా?. తెలంగాణలో మాత్రం అభివృద్ధి జరగవద్దా?. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. మూసీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. ప్రతీ రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నాం. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్‌కు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఐటీఐఆర్ కారిడార్‌ను కేసీఆర్, మోదీ కలిసి రద్దు చేశారు. కిషన్‌రెడ్డి.. గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంగా ఉంటావు. తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా?. తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదు అని ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్యటించలేదు?. మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు, వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుగా పడుకోలేదు? అని ప్రశ్నించారు.
చరిత్ర ఇదే..
జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్‌కు మెట్రో వచ్చింది. ఇది చరిత్ర.. ఇది కేసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.. కనీసం వీసీలను నియమించలేదు. ఐదువేల పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. దశ సరిగ్గా లేని వాడి కోసం వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా?. మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం.
బీసీ కుల గణన చేసి కేంద్రం జనగణనతోపాటు కుల గణన చేసేలా చేశాం. ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా. మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండి.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే..
పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందే. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప.. భవిష్యత్ లేదు. పంతులు లేని బడిలాగా బీఆర్‌ఎస్ తయారైంది. జాబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ సాయం చేస్తోంది. నాది లీడర్ మైండ్ సెట్ కాదు. కేడర్ మైండ్ సెట్, అందుకే నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. నేను గల్లీలోనే కాదు.. ఇంటింటికీ తిరుగుతాను. బీజేపీ డిపాజిట్ కూడా రాదు’ అని జోస్యం చెప్పారు.



