‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’ | CM Revanth Reddy On Irrigation Department | Sakshi
Sakshi News home page

‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’

May 14 2025 8:13 PM | Updated on May 14 2025 9:16 PM

CM Revanth Reddy On Irrigation Department

హైదరాబాద్:  నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. 

ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?, మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశాం. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ. అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారు

గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 

80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు.

తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement