
సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో లబ్ధిదారులకు రేషన్ కార్డు అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి, చామల, కోమటిరెడ్డి, ఉత్తమ్, మహేశ్‌గౌడ్ తదితరులు
70 ఏళ్ల నాటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ హయాంలోని ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా?
నాగార్జునసాగర్ వెళదామా? సుందిళ్ల పోదామా?
బీఆర్‌ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్
రూ.లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు
పదేళ్లలో రేషన్‌కార్డులు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు
మేం రేషన్ కార్డులిస్తున్నాం.. సన్న బియ్యం కూడా ఇస్తున్నామన్న సీఎం
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపు
తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘70 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో కట్టిన మూసీ, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, జూరాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. కేసీఆర్ పాలనలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎలా ఉన్నాయో నాగార్జునసాగర్ కట్టపై చర్చిద్దామా?.. సుందిళ్ల వద్దకు పోదామా?.. చర్చకు సిద్ధమా?’ అని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
రూ.లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కూలిన కూలేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరి తీసినా పాపం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు పేదలకు స్వయంగా రేషన్‌కార్డులు అందజేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు.
నాడు బెల్టు షాపులు తెరిచారు
‘రేషన్‌కార్డు.. పేదల ఆత్మగౌరవం, గుర్తింపు, ఆహార భద్రత. అలాంటి రేషన్ కార్డులను తమ పదేళ్ల పాలనలో పేదలకు ఇవ్వాలన్న ఆలోచనే బీఆర్‌ఎస్‌కు లేదు. అప్పుడు రేషన్ షాపులు తెరవలేదు. బెల్ట్ షాపులను మాత్రమే తెరిచింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో పేదలకు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. 3.10 కోట్ల మంది పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ రోజు రేషన్ షాపుల వద్ద జనాలు నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు.
పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీనితో పాటు రైతు రుణమాఫీ, భరోసా, సన్న ధాన్యానికి బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. పండించిన ప్రతి గింజను కొని బోనస్ ఇచ్చాం.
దాంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం. రైతును రాజును చేసింది ఇందిరమ్మ రాజ్యమే. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులు పండుగ చేసుకుంటున్నారు. గత పదేళ్లలో కొత్త కోడలు వస్తే కార్డులో పేరు నమోదు చేయని పరిస్థితి. ఇప్పుడు 26 లక్షల మంది పేర్లను చేర్చాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
మహిళలు అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం..
‘మహిళల స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందించాం. మహిళా సంఘాలు వ్యాపారంలో అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం. వెయ్యి బస్సులు కొని మహిళా సంఘాలు ఆర్టీసీకే అద్దెకు ఇచ్చేలా రుణాలు అందిస్తున్నాం. నాడు పెట్రోలు బంకులు రిలయన్స్ అంబానీలే పెట్టేవారు. వారితో పోటీ పడేలా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి పెట్రోలు బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం.
మహిళ సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. ఇప్పటికే 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. జనగణనలో కులగణన చేసేలా కాంగ్రెస్ మోదీ మెడలు వంచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం. బీసీలు రాజ్యాధికారం పొందేలా చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఏం చేసిందో మహిళలు ఆలోచించాలి
‘త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క గంజాయి మొక్క మొలవకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. మహిళలు ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. మీకు వడ్డీ›లేని రుణాలు, ఉచిత బస్, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాం. ఇవన్నీ ఇంట్లో మీ ఇంటాయనతో చర్చించి కాంగ్రెస్‌కు సహకరించండి. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం..’ అని సీఎం అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు: మంత్రి ఉత్తమ్
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడు కొత్త రేషన్‌కార్డుల పంపిణీని చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం వస్తే అందులో 90 శాతం వృధా అయ్యేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందజేస్తోందని చెప్పారు.
ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాత రేషన్ కార్డులలో కూడా కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకునే అవకాశం ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు–6 ప్యాకేజీ ద్వారా పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్‌తో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు.20 వేల ఎకరాలు అదనంగా సాగవుతాయన్నారు. బునాదిగాని కాల్వను రీడిజైన్ చేయడానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
కాంగ్రెస్ పేదల ప్రభుత్వం: మహేశ్‌కుమార్‌గౌడ్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజా పాలనలో అమలు చేస్తున్నామని, 5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న ఈరోజు శుభ దినమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం అని అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్‌గౌడ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్‌నాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.