అఖిలను పక్కకు పెట్టేసినట్టే..

Chandrababu Says No Ticket to Bhuma Akhila Priya - Sakshi

సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహా­రశైలి బూమరాంగ్‌ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్‌ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్ర­బాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్‌ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. 

అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్‌ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచ­రులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్‌ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్‌ పేర్కొన్నారు.

 తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్‌ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.  

అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. 

పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్‌ విషయం తేల్చకపో­వడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సో­దరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్‌ అఖిలప్రియకు ఇవ్వ­రనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.    

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top