పెండింగ్‌ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ

Chandrababu Release Pending TDP MP MLA Candidates Names Details - Sakshi

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం.. పెండింగ్‌ స్థానాలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో శుక్రవారం మధ్యాహ్నాం జాబితా విడుదల చేసింది టీడీపీ.

లోక్‌సభ స్థానాల్లో భాగంగా.. విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అలాగే.. అనంతపురం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయనణ, కడప నుంచి భూపేష్‌రెడ్డి పేర్లను ప్రకటించింది.

ఇక తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగానూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి పంతం నెగ్గించుకుని గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి సీటు దక్కించుకున్నారు. విజయనగరం చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీకి మరో సీనియర్‌ కళా వెంకట్రావ్‌ను చంద్రబాబు ముందుంచారు.  దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. కదిరిలో యశోదా దేవిస్థానంలో కందికుంట వెంకట ప్రసాద్‌కు ఛాన్స్‌ ఇచ్చారు.

బీసీలకు వెన్నుపోటు

మొత్తం మీద లోక్ సభ సీట్లకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే బీసీలకు వెన్నుపోటు అన్నది పూర్తిగా స్పష్టమవుతోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 ఆన్ రిజర్వ్‌డ్‌ సీట్లలో ఏకంగా 11 సీట్లను బీసీలకు కేటాయించింది. టీడీపీ కూటమి మాత్రం 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలోనూ చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. కూటమి తరపున 25 సీట్లకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు.

భీమిలిలో బేరాలు

భీమిలిలో గంటా టికెట్‌ విషయంలో చివరివరకు డ్రామా నడిచింది. ఈ సీటు విషయంలో గంటాకు ఇవ్వడానికి ససేమిరా అన్న చంద్రబాబు.. చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాకు సూచించారు. అయితే గంటా మాత్రం ఓడిపోయే సీటు నాకెందుకంటూ పేచీ పెట్టారు. భీమిలి సీటు ఇస్తే.. ఎంత ఖర్చయినా పెడతానంటూ గంటా ముందుకురావడంతో  చంద్రబాబు ఓకే అన్నట్టు తెలిసింది. భీమిలితో పాటు జిల్లాలోని కనీసం నాలుగు చోట్ల ఖర్చంతా పెట్టుకోవాలని గంటాకు షరతు పెట్టినట్టు తెలిసింది.

ఓడిపోయే సీటు నాకు వద్దు బాబోయ్‌.. అని కళా వెంకట్రావు అరిచి గీ పెట్టినా.. ఆయనకు మళ్లీ చీపురుపల్లిని అంటగట్టాడు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కళాకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు రావడంతో.. కళా వెంకట్రావుకు చీపురుపల్లిని ఇచ్చినట్టు తెలిసింది.

వారసులకు మొండి చేయి

అనంతపురంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగిలింది. జేసీ వారసుడు పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వలేదు. ఇటీవల పరిటాల శ్రీరామ్‌కు కూడా చంద్రబాబు మొండిచేయే చూపించాడు. ధర్మవరం నియోజకవర్గంలో టికెట్‌ను పరిటాల శ్రీరామ్‌ ఆశించగా.. ఆ టికెట్‌ను బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించాడు. దీంతో ఇక్కడ పరిటాల శ్రీరామ్‌ బద్ధ శత్రువు వరదాపురం సూరికి టికెట్‌ దక్కింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సూరికి.. టీడీపీ ఇంఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఏ మాత్రం మద్ధతివ్వబోడని బహిరంగంగానే అంటున్నారు. చంద్రబాబు పెనుకొండ మీటింగ్‌ సందర్భంగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు.

గుమ్మనూరు విషయంలో ఏం జరిగింది?

గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రకటించాడు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో టిడిపిని సుదీర్ఘకాలం నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు బాబు వెన్నుపోటు పొడిచినట్టయింది. జయరాంకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జితేంద్రగౌడ్‌కు చివరకు నిరాశే మిగిల్చాడు చంద్రబాబు. చివరిక్షణంలో YSRCP నుంచి వచ్చిన గుమ్మనూరుకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ స్థానిక టిడిపి నేతలు ఊసురుమంటున్నారు. ఇన్నాళ్లు గుమ్మనూరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తాము.. ఇప్పుడు ఆయన్ను గెలిపించాలని ఓటర్లను ఎలా అడుగుతామని అంటున్నారు. చివరికి గుమ్మనూరు ఓడిపోతాడని IVRS సర్వేల్లో తేలినా.. వెన్నుపోటు అన్న ప్రచారానికి భయపడి సీటు కేటాయించినట్టు తెలిసింది. మొత్తమ్మీద ఈ వ్యవహారం వెనక భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గుమ్మనూరు డబ్బు సమర్పించుకోవడం వల్లే జితేంద్రకు అన్యాయం జరిగిందంటున్నారు.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top